
సబ్సిడీ ఎరువుల అక్రమాల నియంత్రణకు కమిటీ
తహసీల్దార్, ఎస్‌ఐ, ఎంఏఓ సభ్యులుగా తనిఖీ బృందం యూరియా పంపిణీ పర్యవేక్షించనున్న తనిఖీ బృందాలు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: సబ్సిడీలో రైతులకు అందిస్తున్న ఎరువుల అక్రమ నిల్వలు, క్రయ విక్రయాలు, పక్కదారి పట్టడం వంటి కార్యక్రమాలను నియంత్రించేందుకు మండల స్థాయిలో తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎరువుల అక్రమాలను అరికట్టేందుకు తనిఖీ బృందాలు రోజు వారీగా మెరుపు దాడులు నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు యూరియా పంపిణీని తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. తహసీల్దార్, ఎస్‌ఐ, మండల వ్యవసాయ అధికారి మండల స్థాయి తనిఖీ బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయి తనిఖీ బృందాల విధుల్లో భాగంగా మండలాల్లోని అన్ని ఎరువుల డీలర్ అవుట్‌లెట్‌లను తనిఖీ చేస్తూ ఈ–పోస్ పరికర బ్యాలెన్స్‌లను భౌతిక స్టాక్‌తో సరిపోల్చుతూ రెండూ సరిపోలుతున్నాయని నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్నారు. నిర్ధారణ కోసం నమోదు చేయబడిన రిటైలర్ల స్టాక్ రసీదులు, అంగీకార పత్రాలను నిశితంగా పరిశీలిస్తారన్నారు. ఏవైనా ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత డీలర్లు, పరిశ్రమలపై ఎఫ్‌సీఓ 1985, ఈసీ చట్టం, 1955 ప్రకారం తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. తదుపరి అవసరమైన చర్యల కోసం డీఏఓ తనిఖీ, చర్యల నివేదికలను ఆలస్యం చేయకుండా సమర్పించాల్సి ఉంటుందన్నారు. యూరియా, టెక్నికల్ గ్రేడ్ యూరియా సరఫరా, స్టాక్ స్థానాన్ని పర్యవేక్షించాలని, అర్హులైన రైతులకు సమానంగా, అవసరాలకు తగ్గట్టు పంపిణీని నిర్ధారిస్తారన్నారు. యూరియా అక్రమ రవాణా, నిల్వను నిరోధిస్తారని, రైతుల నుంచి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు. యూరియాను ముడిసరుకుగా ఉపయోగించే అన్ని పరిశ్రమలు, సరిహద్దుల మీదుగా కదలికలను బృందాలు తనిఖీచేసి తక్షణమే దాడి చేస్తారన్నారు.
ఇండియా స్కిల్స్ కాంపిటేషన్ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా స్కిల్స్ కాంపిటేషన్–25కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీ ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో యువత పాల్గొని, తమ ప్రతిభను కనబర్చాలని కోరారు. డీఆర్‌ఓ ఏకా మురళి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తమ్మాజీరావు, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.