
టంగుటూరి సేవలు చిరస్మరణీయం
నివాళులర్పించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలను శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు పాల్గొని టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రకాశం పంతులు చెప్పిన తెగువ, ధైర్యం నిరుపమానం అన్నారు. సైమన్ గో బ్యాక్ అంటూ బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి ఆంధ్రకేసరిగా పేరుపొందారని తెలిపారు. పట్టుదల, ధైర్యంతో నిరుపేద కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి రాష్ట్ర అభివృద్ధికి కృషిచేసారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జీవీ సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఎస్‌బీ సీఐ బి.సురేష్‌బాబు, వెల్పేర్ ఆర్‌ఐ ఎల్.గోపినాథ్, ఎంటి ఆర్‌ఐ ఎస్.కృష్ణ, అడ్మిన్ ఆర్‌ఐ ఎం.రాజా తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకుని శనివారం కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరిగింది. కార్యనిర్వాహణాధికారి బి. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు జరిపారు. 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవీ హోమం, కుష్మాండ పూజ, కూష్మాండ బలి పూజా కార్యక్రమాలు జరిగాయి.