
సీనియార్టీ జాబితా రూపకల్పనకు వినతి
నెహ్రూనగర్: గుంటూరు జోనల్ పరిధిలోని ఉద్యోగుల సీనియార్టీ జాబితాను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు శనివారం బ్రాడిపేటలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ రీజినల్ డైరెక్టర్ ఎస్. హరికృష్ణను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సచివాలయ ఉద్యోగులందరి సీనియార్టీ జాబితాను జూలై 31వ తేదీ లోపు రూపొందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అనేకచోట్ల ఇది అమలు కాలేదని చెప్పారు. పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయాలని కోరారు. వచ్చే పది రోజుల్లోపు గుంటూరు రీజియన్‌లోని ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారి జాబితాను రూపొందించి, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని ఆర్‌డీ పేర్కొన్నట్లు రజాక్ తెలిపారు. తుది సీనియార్టీ జాబితాను రూపొందించి మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయానికి, ఉద్యోగులకు అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పార్షా మధు, సంఘ నగర నాయకులు అంకారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.