
కొండమోడు సమీపంలోని చిల్డ్రన్ హోంకు తరలింపు
రైలులో బాల కార్మికుల గుర్తింపు
రాజుపాలెం/పిడుగురాళ్ల: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో బాలకార్మికులను రైల్వే పోలీసులు, నీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శనివారం గుర్తించి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో వారిని దించారు. బిహార్ రాష్ట్రం బగల్‌పూర్ జిల్లా ఏక్‌ధర గ్రామానికి చెందిన ముగ్గురు బాలకార్మికులు హౌరా – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెల్ రైలులో అటూ ఇటూ తిరుగుతుండగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు బాల కార్మికులను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచగా చిల్డ్రన్ హోంకు తరలించాలని సూచించారు. వెంటనే పోలీసులు మండలంలోని కోటనెమలిపురి పరిధిలో గల కొండమోడు సమీపంలోని వీరమ్మ కాలనీలో దీనమ్మ అండ్ రూరల్ డెవెలెప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోంకు తరలించారు. బాలకార్మికుల ద్వారా తల్లిదండ్రుల వివరాలు తెలిసుకుని వారిని రప్పించి అన్ని ఆధారాలతో అప్పజెబుతామని సొసైటీ చైర్మన్ గరికపాటి శంకరరావు తెలిపారు. పిడుగురాళ్ల రైల్వే ఎస్‌ఐ హుస్సేన్, ఏఎస్‌ఐ సంతరాజు, నీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రవికుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధి రామకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.