
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంతమాగులూరు(అద్దంకి రూరల్): బైకు మీద వెళ్తున్న భార్యాభర్తలను వెనకు నుంచి లారీ ఢీకొట్టటంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం జరిగింది. సంతమాగులూరు ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ (44) బైక్‌పై కొమ్మాలపాడు నుంచి సంతమాగులూరు వైపు వస్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కోటేశ్వరమ్మకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలైన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్మ
చీరాల అర్బన్: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్‌లో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐక్యనగర్‌కు చెందిన డి.వెంకటేశ్వర్లు (36) ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుని గ్రూప్స్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ ఎస్‌ఐ నాగశ్రీను తెలిపారు.