
కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలి
లక్ష్మీపురం (గుంటూరు): రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం కౌలు రైతులే ఉన్నా గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు ఆరోపించారు. వారికి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడిపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలనే నిబంధన వల్ల కార్డులు రాలేదన్నారు. పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. స్పందించి వారి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నాగమల్లేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.సాంబిరెడ్డి, పి.కృష్ణ, అమ్మిరెడ్డి, వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.