
పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట తిపాఠి ఆదేశించారు. గుంటూరు పశ్చిమ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, కేసు డైరీలు, క్రైమ్ రిజిస్టర్, పెండింగ్ కేసుల ఫైల్స్, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నిందితుల అరెస్టులు, కోర్టు హాజరు స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ నేర నిరోధక చర్యలను మరింత వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నిందితులకు త్వరగా న్యాయస్థానాల్లో శిక్షలు అమలయ్యేలా విధులు నిర్వర్తించాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ల కార్యకలాపాలలో పారదర్శకత చూపాలని ఆదేశించారు. క్రమ శిక్షణ, సంక్షేమంపై దృష్టిసారించి, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్, పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం పీఎస్‌ల సీఐలు పాల్గొన్నారు.
గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశం