
చిన్న వర్షానికే మునక
పొంగిపొర్లుతున్న పాటిబండ్ల వాగు ఏటా నీట మునుగుతున్న వేలాది ఎకరాలు వాగుపై కంప, వ్యర్థాలు, ఆక్రమణలతోనే దుస్థితి
శాశ్వత పరిష్కారం చూపించండి..
పెదకూరపాడు: పాటిబండ్ల వాగు ఉధృతికి ప్రతి ఏటా వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకు సైతం వాగు పొంగిపొర్లి సాగు భూములపై పడుతుంది. పాటిబండ్ల వాగు పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల, పొడపాడు, జలాల్‌పురం, పెద్దమక్కెన, పెదకూరపాడు, బలుసుపాడు, కంభంపాడు, పరస, నరుకుళ్లపాడు, లింగాపురం, వైకుంఠపురం మీదుగా పారుతుంది. పేరమ్మవాగు, పిల్లవాగుల నీరుకూడ ఇందులోనే కలుస్తాయి. ఈ వాగు కింద సుమారు మూడువేల ఎకరాలు ఉన్నాయి. ప్రతి ఏడాది చిన్నపాటి వర్షాలకు సైతం వాగు పొంగిపొర్లుతుండడంతో పంటలు జలమయమవుతున్నాయి.
వ్యర్థాలు, ఆక్రమణలే కారణం
ఏళ్ల తరబడి వాగుకు పూడిక తీయకపోవడం, వాగులో కొట్టుకు వచ్చే వ్యర్థాలు, వాగు ఇరుపక్కల ఉన్న ముళ్లకంప ఎండి, ఇందులో పడటం, తదితర కారణాలతో వాగులో నీరు ముందుకు పారడం లేదు. అంతేకాకుండా పలువురు ఈ వాగు గట్ల వరకు ఆక్రమిస్తూ, తమ సరిహద్దులను విస్తరిస్తుండడం కూడా ఏటా ఈ దుస్థితికి కారణం అని చెప్పుకోవచ్చు. వాగులో పూడిక తీయాలని, కంపచెట్లు, ఆక్రమణలు తొలగించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం శూన్యమని స్థానిక రైతులు వాపోతున్నారు.
పాటిబండ్ల వాగు పూడికతీస్తే పంటలు మునగవు. నేను వేసిన రెండు ఎకరాల పైరు ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాగు పొంగడంతో నీట మునిగింది. ప్రతి ఏడాది ఇదే సమస్య. ఆశతో సాగు చేస్తే వాగు పొర్లడం, పంట పీకడం జరుగుతుంది. వాగు పక్కన ఆక్రమణలు కూడా తొలగించాలి.
– పఠాన్ ఇసూబ్‌ఖాన్,
రైతు, పాటిబండ్ల

చిన్న వర్షానికే మునక

చిన్న వర్షానికే మునక