
‘గుడ్ మార్నింగ్’ ఆపేందుకు కుట్ర
ఎన్ని కేసులు పెట్టినా కార్యక్రమం ఆగదు పుట్టిన రోజు కేక్ కట్ చేస్తే కేసులా..? పోలీసు యాక్ట్ 30 టీడీపీ వారికి వర్తించదా..? మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందనే కారణంతో ఎలాగైనా ఆ కార్యక్రమాన్ని ఆపాలనే కుట్రతో ఎమ్మెల్యే, టీడీపీ నాయకుల ఆదేశాలతోనే పోలీసులు తనపై కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగు వారాల నుంచి తాను పట్టణంలో పారిశుద్ధ్యం, పెన్షన్లు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించే నిమిత్తం ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమం ప్రారంభించినప్పుడు పోలీసులు పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉందని, కార్యక్రమం నిర్వహించటానికి వీలులేదని నోటీసు ఇచ్చారన్నారు. అదే రోజు టీడీపీ పట్టణ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం పేరుతో భారీగా ర్యాలీ చేశారని, వారికి ఎటువంటి నోటీసు ఇవ్వలేదని, ర్యాలీ సందర్భంగా ఎంత ట్రాఫిక్ ఆగిపోయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
టీడీపీ వారికో న్యాయం.. మాకో న్యాయమా ?
గత ఆదివారం కార్యక్రమం అనంతరం ప్రకాష్‌నగర్ రిక్షా సెంటర్‌లో కాఫీ తాగేందుకు ఆగామని, అక్కడ తమ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్య దర్శి పుట్టినరోజు అని తెలిసి రోడ్డు మార్జిన్‌లో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగనీయకుండా కేక్ కట్ చేశామన్నారు. కార్యక్రమం మొత్తం పది నిమిషాల్లో ముగిసిందని, అయినప్పటికీ తమ నాయకులు పదహారు మందిపై కేసు పెట్టారన్నా రు. పుట్టినరోజు జరుపుకొన్న తమ పార్టీ నాయ కుడిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు స్టేషన్‌లో కూర్చోబెట్టడం అన్యాయమన్నారు. మంగళవారం నాడు టీడీపీ నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం పేరుతో మూడు గంటలపాటు పట్టణంలో అనేక రోడ్లు బ్లాక్ చేశారని, మరి వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు, ఎన్ని అరెస్టులు చేసినా గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
దేవునికి ప్రార్థనలు చేసుకునే హక్కు కూడా లేదా?
అక్రమ కేసులో ఎంపీ మిధున్‌రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో ఉంచారని, ఆయన యోగక్షేమాల నిమిత్తం భగవంతుని ప్రార్థించుకునే క్రమంలో ఆ నియోజకవర్గ పార్టీ నాయకులు కొంతమంది మెట్ల మార్గం ద్వారా పాదయాత్రగా తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వద్దకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేయటం దారుణమన్నారు.