ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు శాంతిబాయి
మాచర్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన డీఏ బకాయిల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సాంబేలు శాంతిబాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది ఉద్యమ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏల కోసం అసోసియేషన్ తరఫున ఈ నెల 14న హైకోర్టులో పిటీషన్ వేసినట్లు ఆమె చెప్పారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర దాటుతున్నా ఉద్యోగులకు అందించాల్సిన టీఏ, డీఏలను చెల్లించటంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హై కోర్టును ఆశ్రయించామని ఆమె తెలిపారు.
తెనాలిఅర్బన్: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26వ తేదీలోపు వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. తెనాలి, గుంటూరులలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాలలో 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈ నెల 29, 30వ తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు సెల్ నెంబర్ 93914 02683లో సంప్రదించాలని సూచించారు.
తెనాలి రూరల్: తెనాలి టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ ఆవరణలో కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ప్రవేటు ఏజెన్సీకి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ తెనాలి టెలికాం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె. పద్మావతి చేపట్టిన నిరసన దీక్షను బుధవారం విరమించారు. 10 రోజులుగా ఆమె దీక్ష చేస్తుండడంతో అఖిల భారత బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు గుంటూరు నుంచి తెనాలికి వచ్చారు. దీక్షలో కూర్చున్న ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల వద్దకు వెళ్లి ఆమెకు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేటు ఏజెన్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. సరిపడా ఉద్యోగులు ఉన్న తెనాలిలో ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వారు అధికారులకు సూచించారు. అనంతరం పద్మావతి చేత దీక్ష విరమింపజేశారు.
రూ.4 లక్షలు గుంజుకుని పరారీ
వేటపాలెం: బంగారు వ్యాపారిపై రౌడీషీటర్ దాడి చేసి రూ.4 లక్షలను బలవంతంగా లాక్కున్న ఘటన అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడిన బంగారు వ్యాపారి చీరాల ఏరియా వైద్యశాలలో చిక్కిత్స పొందుతూ, అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. అక్కాయపాలెం లక్ష్మీపురానికి చెందిన రౌడీషీటర్ మల్లెల రాజేష్ తన వద్ద పాత బంగారం ఉందని, తక్కువ ధరకు అమ్ముతామని తన సెల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో ఉంచాడు. విజయవాడకు చెందిన బంగారు వ్యాపారి రెహమాన్ ప్రకటన చూసి రాజేష్‌కు ఫోన్ చేశాడు. దీంతో లక్ష్మీపురం రావాలని రెహమాన్‌కి చెప్పాడు. ఇది నమ్మిన అతడు బంగారం కొనుగోలు కోసం లక్ష్మీపురంలోని రౌడీషీటర్ ఇంటికి వచ్చాడు. వెంటనే వ్యాపారిపై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.4 లక్షలను రాజేష్ లాక్కున్నాడు. అక్కడ నుంచి తప్పించుకొన్న వ్యాపారి చీరాల ఏరియా వైద్యశాలకు చేరి ఫిర్యాదు చేశాడు. రౌడీ షీటర్‌పై అనేక పోలీస్ స్టేషన్‌లలో పలు కేసులు నమోదై ఉన్నాయి.