
‘ప్రత్యేక’ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్ సెల్వరాజ్
సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఉచిత వైద్య నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోవాలని సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్ సెల్వరాజ్ అన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నియోజకవర్గంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం విద్యాశాఖ, సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో అలింకో వారిచే మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య నిర్ధారణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెల్వరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 28 భవిత సెంటర్లలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు 540 మంది ఉన్నారన్నారు. వీరు కాక ప్రతి మండలంలో సుమారు 100 నుంచి 150 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరి అవసరాల నిమిత్తం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ నిర్ధారణ వైద్య శిబిరాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఈ శిబిరాలు 25 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 25న జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శిబిరం జరుగుతుందన్నారు. బెంగళూరు వైద్యులు అవసరమైన ఉపకరణాలను నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఉపకరణాలను త్వరలోనే ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.