
సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
వినాయకుని ఊరేగింపునకు అవకాశం కల్పించాలి
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం తదితర సమస్యలకు సంబంధించిన 86 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై శ్రద్ద వహించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు.
జాబ్‌తో పాటు కమీషన్ ఇప్పిస్తామని ఓ ప్రాపర్టీస్ సంస్థ ప్రతినిధులు రూ.35.50లక్షలు మోసం చేశారు. నా ఫోన్ నెంబరుతో వర్క్ ఫ్రం హోం ప్లాట్‌ఫామ్‌తో పాటు ఐడీని క్రియేట్ చేసి డబ్బులు వస్తాయని ఆశ చూపించారు. ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి 20 ప్రాజెక్ట్‌ల నుంచి కమీషన్ ఇస్తామని నమ్మించారు. దీనిని నమ్మి ఈ ఏడాది జూలై 28వ తేదీ నుంచి ఈనెల 13వ తేదీ వరకు సుమారు రూ.35.50లక్షలు ఫోన్ పే ద్వారా పంపించాను. కమీషన్ నగదు అడగ్గా సదరు ప్రాపర్టీస్ ప్రతినిధులు మరో రూ.5లక్షలు చెల్లిస్తే మొత్తం ఇస్తామని చెబుతున్నారు. మోసపోయాను.. సదరు సంస్థ నుంచి నగదు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.
– తోట అజయ్, వినుకొండ
మేం ముగ్గురం ఎంసీఏలు పూర్తిచేసి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాం. అక్కడ కాసరగడ్డ నరేంద్ర అనే అతను ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇందుకు రూ.4లక్షలు చెల్లించాలని చెప్పాడు. నమ్మి ముగ్గురం కలిపి రూ.4లక్షలు చెల్లించాం. అయితే ఆరు నెలలు గడుస్తున్నా, జాబ్‌లు చూపించకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.
– షేక్ రబ్బాని, షేక్ ఖాజా
మొహిద్దీన్, షేక్ మస్తాన్‌బాషా
గ్రామంలోని ఎస్టీ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా గణేశ్ పందిరి ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నాం. నిమజ్జనం సందర్భంగా గత ఏడాది గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అగ్రకులాల వారు అడ్డుకున్నారు. ఈ ఏడాది కూడా అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం ఉంది. గ్రామంలో ఊరేగింపు సక్రమంగా జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– ఎస్టీ కాలనీ వాసులు, పెద రెడ్డిపాలెం