ముగ్గురుకి తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
పెదకూరపాడు: ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు గాయపడిన సంఘటన మండలంలోని పెదకూరపాడు– లింగంగుంట్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాటిబండ్లకు చెందిన మన్నవ జోసఫ్, జలాల్‌పురం గ్రామానికి చెందిన మన్నవ కిరణ్‌లు పెదకూరపాడు వచ్చి తిరిగి వెళుతున్నారు.
ఇదే సమయంలో పొడపాడు నుంచి ఆటోలో ప్రయాణికులతో సారెకుక్క జోసఫ్ పెదకూరపాడు వస్తున్నాడు. ఈ క్రమంలో పెదకూరపాడు–లింగంగుంట్ల వద్ద మూల మలుపులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న జోసఫ్, కిరణ్‌లు నాలుగు అడుగులు మేర ఎత్తుకు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జోసఫ్‌కు తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.
ఆటో డ్రైవర్ సారెకుక్క జోసఫ్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో గాయపడిన వారిని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు తరలించారు. ఇందులో కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.