
‘అసెస్మెంట్ బుక్’పై ఉపాధ్యాయుల అసంతృప్తి
నరసరావుపేట ఈస్ట్: అసెస్మెంట్ బుక్ విధానంపై ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు తెలిపారు. ఎస్‌టీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల మూల్యాంకనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒక్కో ఉపాధ్యాయుడు మౌఖిక పరీక్షలు, విద్యార్థుల ప్రతిస్పదనలను వందలాది పేజీలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైమరీ తరగతులకు 240 పేజీలు, ఉన్నత తరగతులకు 147 పేజీల్లో విద్యార్థి ప్రతిస్పందనలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయుడు వందలాది పేజీలను నమోదు చేసుకుంటూ ఉంటే బోధనకు సమయం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పరీక్షలు ముగిసిన పది రోజుల పాటు ఉపాధ్యాయుడు మూల్యాంకన పుస్తకాలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఇదేమి మదింపు విధానమంటూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై మండి పడ్డారు. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ పెడుతున్న పరీక్షలు ఉపాధ్యాయులకా.. విద్యార్థులకా ? అని ప్రశ్నించారు. ఇప్పటికే మోడల్ స్కూల్ పేరిట చేపట్టిన సంస్కరణల కారణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి, ప్రైవేటుకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఎసెస్మెంట్ బుక్స్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.చంద్రజిత్ యాదవ్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటకోటయ్య, ఆర్థిక కార్యదర్శి ఏ.ఏమండీ పాల్గొన్నారు.
ఏఐఎస్‌టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి
జోసఫ్ సుధీర్‌బాబు