
పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు
రాజుపాలెం: భారీవర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు–మాచర్ల రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎద్దువాగు పొంగడంతో 8 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం గ్రామం సమీపంలో వాగు రోడ్డుపై నుంచి పొంగి ప్రవహించింది. దీంతో మాచర్ల–గుంటూరు మధ్య అన్ని వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ వేణుగోపాల్, సిబ్బంది అనుపాలెం చేరుకొని ప్రమాదం వాటిల్లకుండా వాహనాలను క్రమబద్ధీకరించారు. గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య ఎద్దువాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని ప్రభావంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇనిమెట్ల, ఉప్పలపాడు, బలిజేపల్లి, రామిరెడ్డిపేట, లక్ష్మీపురం చల్లాపల్లితండా– గణపవరం, రెడ్డిగూడెం, బీర్లవల్లిపాయ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వాగుల సమీప ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి. మెట్టపైర్లు సాగుచేస్తున్న రైతులు నష్టపోవాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు. బలిజేపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. తహసీల్దార్ సరోజిని మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వీఆర్వోలను ఆదేశించామన్నారు.
అంచులవారిపాలెం, అనుపాలెం, గణపవరం ప్రాంతాల్లోని వాగుల వద్ద వీఆర్వోల ఆధ్వర్యంలో భధ్రతా చర్యలు చేపట్టామన్నారు. వర్షప్రభావానికి సహాయక చర్యల కోసం 24 గంటలు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, అత్యవసర సహాయం కోసం 9949098622 నంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు.
గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య పొంగిపొర్లిన ఎద్దువాగు 8 గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు అనుపాలెం సమీపంలో మాచర్ల – గుంటూరు రహదారిపై పొంగిన మరో వాగు మాచర్ల–గుంటూరు మధ్య నిలిచిపోయిన రాకపోకలు బలిజేపల్లిలో నిలిచిన విద్యుత్ సరఫరా

పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు