
నాగార్జునకొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధుల బృందం
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను ఆదివారం శ్రీలంక దేశానికి చెందిన 45 మంది బౌద్ధుల బృందం సందర్శించింది. వీరు నాగసిరి లాంచీలో నాగార్జున కొండకు చేరుకొని అక్కడి మ్యూజియంలో ఉన్న 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి సామగ్రి, సింహాళ విహార్‌లోని మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించి బౌద్ధ గురువు దలైలామా నాటిన బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. పర్యాటకులు లాంచీలలో నాగార్జునకొండకు వెళ్లిన నేపథ్యంలో పర్యాటక శాఖకు 72 వేల రూపాయల ఆదాయం చేకూరినట్లు అధికారులు తెలిపారు.
లాంచీ స్టేషన్‌ను
సందర్శించిన జీఎం
విజయపురిసౌత్: పర్యాటక శాఖ జీఎం చందన నాంచారయ్య ఆదివారం లాంచీస్టేషన్‌ను పరిశీలించారు. మరమ్మతులకు గురైన లాంచీని రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. హరిత రిసార్ట్స్ ఉద్యోగులకు సూచనలు చేశారు. లాంచీ యూనిట్ మేనేజర్ వినయతుల్లా, విజయవాడ అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, రిసార్ట్స్ మేనేజర్ మస్తాన్ రావు, పులుసు వీరారెడ్డి తదితరులు ఉన్నారు.

నాగార్జునకొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధుల బృందం