
కృష్ణా జిల్లాలో నరసరావుపేట యువకుడు మృతి
నిడమానూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
నరసరావుపేట టౌన్: నరసరావుపేట యువకుడు కృష్ణా జిల్లాలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇస్లాంపేటకు చెందిన షేక్ మహ్మద్ హరీస్(25) ఏలూరులోని స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై ఏలూరు నుంచి విజయవాడ బయలుదేరాడు. మార్గమధ్యంలోని నిడమానూరు జాతీయ రహదారిపై గుర్తు తెలియనివాహనం ఢీకొంది. సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. హరీస్ తండ్రి దరియావలి ఇస్లాంపేటలో రేషన్ డీలర్‌గా వ్యవహరిస్తుంటాడు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి బలవన్మరణం
చిలకలూరిపేట టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ప్రత్తిపాటి రమేష్(33) కొంత కాలంగా చిలకలూరిపేట పట్టణంలోని ఆదిఆంధ్రా కాలనీలో ఉంటున్నారు. రమేష్ భార్యను మద్యం నిమిత్తం డబ్బులు ఇవ్వాలంటూ కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత భర్తకు టిఫిన్ తీసుకువచ్చేందుకు భార్య రాహేలు బయటకు వెళ్లి తిరిగి రాగా తలుపు వేసి ఉండటంతో తెరిచి చూడగా భర్త సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నేడు మంగళగిరిలో కేవీపీఎస్ జిల్లా మహాసభ
మంగళగిరి టౌన్: కేవీపీఎస్ గుంటూరు జిల్లా ఆరవ మహాసభ ఆదివారం సాయంత్రం మూడు గంటలకు మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజారులోని కార్యాలయంలో జరుగుతుందని పట్టణ కార్యదర్శి వై. కమలాకర్ శనివారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...సామాజిక న్యాయం అంశంపై సదస్సు కూడా జరుగుతుందని తెలిపారు. ప్రధాన ఉపన్యాసకులుగా డి.ఎస్.ఎం.ఎం. జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సామ్యేల్ ఆనందకుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, కేవీపీఎస్ జిల్లా నాయకులు బి. వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగిస్తారని కమలాకర్ తెలిపారు.