నరసరావుపేటటౌన్: కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్యను హతమార్చిన భర్తను అరెస్ట్ చేసినట్లు ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 2వ తేదీ రాత్రి కంభంపాలెంకు చెందిన మృతురాలు మేరీ కనిపించటంలేదని ఆమె తల్లి కోటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశామన్నారు.
విచారణలో భర్త జొన్నలగడ్డ రమేష్ ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లినట్లు సీసీ పుటేజ్ లభ్యమైందన్నారు. అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా, మేరీను అదే రోజు నకరికల్లు అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి హతమార్చినట్లు రమేష్ నేరాన్ని అంగీకరించాడన్నారు. అతను ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని మేరీ మృతదేహాన్ని కనుగొన్నామన్నారు. సమావేశంలో సీఐ విజయ్ చరణ్, ఎస్‌ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
కిడ్నాప్ చేశామంటూ.. నగదు స్వాహా
ఫోన్‌లో వృద్ధ దంపతులను బెదిరించి రూ.50వేలు కొట్టేసిన ఆంగతకులు
చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): ‘మీ అబ్బాయి ఇక్కడ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే అదుపులోకి తీసుకున్నాం... మీ వాడ్ని చంపేస్తాం... మీ అబ్బాయి మీకు కావాలంటే అర్జెంట్‌గా మాకు రూ.50వేలు పంపండి... లేకుంటే మీ అబ్బాయి మీకు దక్కడంటూ’ ఓ వ్యక్తి బెదిరింపు ఫోన్‌కాల్‌తో భయపెట్టి సొమ్ము కాజేసిన సంఘటన మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చాగంటివారిపాలెంకు చెందిన అనుమాలశెట్టి శ్రీనివాసరావు కుమారుడు వెంకట బాలసతీష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి శ్రీనివాసరావు గ్రామంలోనే చిల్లర దుకాణం నిర్వహిహించుకుంటూ జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఓ ఫోన్‌కాల్ రావటంతో శ్రీనివాసరావు బయటకు వెళ్లటంతో భార్య పద్మావతి ఫోన్‌లిఫ్ట్ చేసింది. ఫోన్‌లో అవతల వ్యక్తి హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మీ వాడ్ని కిడ్నాప్ చేశామని, అర్జంట్‌గా రూ.50వేలు ఫోన్‌పే చేయకపోతే చంపేస్తామంటూ ఏడుపులు, అరుపులు వినిపిస్తూ భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడసాగాడు. ఆ సమయంలో వెంకట బాలసతీష్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్రీనివాసరావు దంపతులు వారు పంపిన నెంబర్‌కు రూ.50వేలు ఫోన్‌పే చేశారు.
కొద్దిసేపటి తర్వాత వెంకట బాలసతీష్ తల్లిదండ్రులకు ఫోన్ చేయటంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే వారు ఫోన్ చేసిన నెంబర్‌కు ఫోన్ చేయగా వారు హిందీలో సంభాషించారని శ్రీనివాసరావు దంపతులు తెలిపారు. వెంటనే శ్రీనివాసరావు ముప్పాళ్ళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన నెంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా వారితోను అదే రీతిలో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. ఫోన్ పే చేసిన నెంబర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినదనే ప్రాథమికంగా గుర్తించారు. విషయాన్ని సైబర్‌క్రైమ్ దృష్టికి తీసుకెళ్లటంతో విచారణ చేపట్టినట్లు సమాచారం.

భార్యను హతమార్చిన భర్త అరెస్ట్