క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరాని గాను 4, 5 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 19వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్రీడా శాఖ వెబ్‌సైట్ www. apsportsschool. ap. gov. in ద్వారా తరగతుల వారీగా సీట్లు వివరాలు, షెడ్యూలు, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో బాలురు 20, బాలికలు 20, 5వ తరగతిలో బాలురు 20, బాలికలు 20 సీట్లు ఉన్నాయని తెలిపారు. 4వ తరగతి ప్రవేశానికి అభ్యర్థులు 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలని, అలాగే 5వ తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం వాస్తవ పుట్టిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు జారీ చేసి ఉండాలని స్పష్టం చేసారు. దరఖాస్తుదారుని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వైద్య పరీక్షల్లో సంతృప్తి చెందిన తరువాత మాత్రమే జిల్లాస్థాయి ఎంపిక పోటీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. జిల్లాస్థాయిలో సాధించిన మెరిట్ ప్రాతిపదికన రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారనీ, రాష్ట్రస్థాయిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికను సీటు కేటాయిస్తారని తెలిపారు. జిల్లాస్థాయి శారీరక సామర్ధ్య పరీక్షలు ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు, రాష్ట్రస్థాయి పరీక్షలు జూలై 10, 11 తేదీలలో నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డీఎస్‌ఓ నరసింహారెడ్డి


