పోలీసుల తీరు హేయం
తెనాలిరూరల్: దళిత, మైనార్టీ యువకులపై జనావాసాలు మధ్య బహిరంగంగా, కర్కశంగా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంతకుమార్ అన్నారు. తెనాలిలో సోమవారం ఆయన మాట్లాడారు. ముగ్గురు బాధితులను అమానుషంగా హింసించడంపై ప్రజా హక్కులు సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయన్నారు. పోలీసుల చర్యలను సమర్థిస్తూ బాధిత యువకులపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు దృవపత్రాలు సమర్పించిన డాక్టర్లతో పాటు సాక్షులుగా ఉన్న వీఆర్వోలను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ బేతాళ ప్రభాకర్, దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది కొరివి వినయ్ కుమార్, తెనాలి జేఏసీ అధ్యక్షుడు బొనిగల ప్రదీప్, తెనాలి నియోజకవర్గం ఇన్‌చార్జి కారుమంచి సునీల్ సందీప్, న్యాయవాదులు గుంటి సురేష్ బాబు, గుమ్మడి రవిరాజు, కంచర్ల కోటేశ్వరరావు, కనపర్తి కుటుంబరావు, పెనుమాక మధు, దోమ రమేష్ రాంజి తదితరులు పాల్గొన్నారు.


