ఎగుమతులు ఉంటేనే వ్యవసాయం లాభసాటి
నరసరావుపేట: రైతులు పండించే పంటలకు తగిన ఎగుమతి అవకాశాలు ఉంటే వారి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఏపీఇడీఏ సంస్థ అధికారి డి.పెద్దస్వామి పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో ఉద్యాన జిల్లా అధికారి ఐ.వెంకటరావు ఆధ్వర్యంలో వ్యవసాయ ఎగుమతులు వాటి అవకాశాలపై రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దస్వామి రైతులు పండించే పంటలకు ఎగుమతి అవకాశాల గురించి వివరించారు. నాబార్డు డీడీఎం జి.శరత్‌బాబు మాట్లాడుతూ రైతులకు నాబార్డ్ ద్వారా అందించే వివిధ పథకాలు, రాయితీ వివరాలను తెలిపారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించి తద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అన్ని రకాల పండ్లు, కూరగాయల తోటలలో ప్రకృతి సేద్య పద్ధతులను రైతులకు వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ జిల్లా అధికారి సీహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ సన్న, చిన్న కారు రైతులకు 90శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు, అలాగే 50 శాతం రాయితీ ద్వారా స్ప్రింక్లర్ పరికరాలు అందజేస్తున్నామన్నారు. వినుకొండ, గురజాల, చిలకలూరిపేట, పిడుగురాళ్ల ఉద్యాన అధికారులు షేక్ నబి రసూల్, వై.మోహన్, ఆర్.శ్రీలక్ష్మి, అంజలి భాయి, గ్రామ ఉద్యాన సహాయకులు రైతులు పాల్గొన్నారు.


