ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనం, త్యాగ సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమైనవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు అందరూ శాంతి, సమాధానాలతో, ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను నిర్వర్తించుకోవాలని ఆకాంక్షించారు. తోటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, సహనం, త్యాగం వంటి విలువలు సమాజాన్ని మరింత బలపరుస్తాయని ఆయన తెలిపారు. క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రధాన చర్చిలు, ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.


