ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు
వినుకొండ : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబరు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే 99శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వినుకొండలో ఉదయం 10గంటలకు వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించి ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.
పింఛన్ల నిలిపివేత దుర్మార్గమైన చర్య
శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామంలో 72 పింఛన్లు ఆపివేయడం దుర్మార్గమైన చర్య అని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఎక్కడా లేని విధంగా రాజకీయ కక్షతో, దురుద్దేశంతోనే పింఛన్‌లను తొలగించారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


