ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషి
● ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ● చైర్మన్ కొనకళ్ల, ఎమ్మెల్యేతో కలిసి ఆర్టీసీ డిస్పెన్సరీ ప్రారంభం
నరసరావుపేట: సంస్థ రేటింగ్ పడిపోకుండా ఉద్యోగులు పనిచేయాలని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఆర్టీసీ గ్యారేజ్ స్థలంలో సుమారు రూ.84లక్షల వ్యయంతో నిర్మించిన డిస్పెన్సరీని బుధవారం ప్రారంభించారు. డిస్పెన్సరీ శిలాఫలకాన్ని సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఆవిష్కరించగా డిస్పెన్సరీని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఎండీ తిరుమలరావు రిబ్బన్‌కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో తిరుమలరావు మాట్లాడుతూ ఆక్యుపెన్సీ పెంచాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యానికి పెద్దపీట వేసి కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, హృద్రోగ పరీక్షలు చేపట్టామన్నారు. మచిలీపట్నంలో ఇప్పటికే నూతన డిస్పెన్సరీని ప్రారంభించామన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లకు లంచాలు అడుగుతున్నారనే వార్తల నేపధ్యంలో అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ తనకు ట్రేడ్ యూనియన్లతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఇప్పుడు అన్నీ వ్యవస్థలు భ్రష్టుపట్టి పోగా ఒక్క ఆర్టీసీనే నిజాయతీగా పనిచేస్తుందన్నారు. నేడు వైద్యపరీక్షలు, చికిత్స అత్యంత ఖరీదుగా మారింరాయని, ప్రాథమిక వైద్యం కోసం ఇటువంటి డిస్పెన్సరీలు ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రూ.30కోట్ల వ్యయంతో నూతన డిపో నిర్మాణం చేస్తామన్నారు. డిస్పెన్సరీకి కావాల్సిన ఏసీ సౌకర్యాన్ని తాను కల్పిస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి, జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.మధు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రంగిశెట్టి రామకృష్ణ, ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక యూనియన్ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


