నమ్మించి.. నిండా ముంచి..! | - | Sakshi
Sakshi News home page

నమ్మించి.. నిండా ముంచి..!

Apr 28 2025 1:01 AM | Updated on Apr 28 2025 1:01 AM

నమ్మి

నమ్మించి.. నిండా ముంచి..!

శరీరంపై ఖరీదైన చొక్కా, రెండు చేతులకు వేళ్లనిండా ఉంగరాలు, మెడలో జిగేలుమనిపించే బంగారు చైన్లు, రూ.లక్షలు ఖరీదు చేసే కార్లు, రూ.కోట్ల విలువైన భవనాలు, హడావుడి చేసే వ్యాపారాలు.... ఇవి ఉంటే చాలు బ్యాంకుల కంటే ఇలాంటి వారే భద్రమని నమ్మేస్తున్నారు. బ్యాంకుల్లో వడ్డీల కంటే వీరి వద్దే అధికమని ఆశ పడుతున్నారు. అదిగో ఆ హంగు.. ఇక మన డబ్బులకు ధీమా అని రూ.కోట్లకు కోట్లు వారి చేతుల్లో పెట్టేస్తున్నారు. వీరితోపాటు తమ బంధుమిత్రులనూ ఆ బడాబాబుల వలలోకి లాగేస్తున్నారు. ఆ బడాబాబులు తమ వ్యాపారంలో పరిస్థితులు తలకిందులైనట్లు కథలు చెప్పి రూ.వందల కోట్లతో పరారవుతున్నారు.

సాక్షి, నరసరావుపేట: అవసరానికి ఉపయోగపడతాయని రూపాయి రూపాయి కూడబెట్టి పెట్టుబడులు పెట్టిన వారు భారీ మోసాలను చూసి అమ్మో అంటూ గుండెలు బాదుకుంటున్నారు. తనువు చాలిస్తున్నారు. ఇది ఓ యానిమేషన్‌ స్కాంతో మొదలుకాలేదు. నిత్యం ఇలాంటివి ఏదో ఒక మూల వింటూనే ఉన్నాం. అయినా సరే అధిక లాభాలు, వడ్డీల ఆశచూపి మోసగాళ్లు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మోసపోయే మనలో కూడా ఎంతో కొంత తప్పు ఉందన్న వాస్తవాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టపడేది.

ఆడి కార్‌లో వచ్చి మరీ..

దేశంలో ఆర్థిక నేరాలను వివిధ రూపాల్లో చూస్తుంటాం. బ్యాంకులకు రుణాలు ఎగనామం పెట్టే వాళ్ల దగ్గర నుంచి చిన్న మొత్తాల్లో చీటీలు వసూలు చేసి జేబులకు చిల్లులు పెట్టే వారు, టెక్నాలజీ సాయంతో సైబర్‌ మోసాలకు పాల్పడే వారు కనిపిస్తుంటారు. అయితే నరసరావుపేటలో మాత్రం నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి నట్టేట ముంచుతున్నారు. అధిక వడ్డీల ఆశ చూపి రూ.కోట్లకు కోట్లు సేకరించి రాత్రికి రాత్రి పరారవుతున్నారు. చిట్‌ఫండ్‌ స్కాం, ఐపీ పెడుతున్న వ్యాపారులు, తాజాగా యూపిక్స్‌ యానిమేషన్‌ స్కాం.. ఇలా ఏది చూసినా ప్రజలను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. యూపిక్స్‌ సంస్థ అధినేత కిరణ్‌ తను చేస్తున్న యానిమేషన్‌ ప్రాజెక్టులను లేనిది ఉన్నట్టు పెద్దగా చూపి పెట్టుబడిదారులను మోసం చేశాడు. పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని ఒక్కసారిగా తన వద్ద అంత డబ్బులు లేవని నమ్మించాడు. పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో రెట్టింపు చేసి ఇస్తానని నమ్మబలికాడు. ఇలా రెండేళ్లు పెట్టుబడిదారులకు లాభాల రుచి చూపడంతో వారిలో నమ్మకం పెరిగింది. మరోవైపు తమ కళ్ల ముందే కిరణ్‌ జీవనవిధానం రోజురోజుకు లగ్జరీగా మారడం కూడా మోసపోవడానికి కారణమైంది. సాధారణ కారులో తిరిగే కిరణ్‌ ఒక్కసారిగా ఆడి కార్లు, రేంజ్‌ రోవర్లలో చక్కర్లు కొట్టడం, విజయవాడలోని పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, విలువైన స్థలాలు ఉండటంతో తమ డబ్బులు ఎక్కడికీ పోవనే ధీమాతో స్థోమతకు మించి పెట్టుబడులు పెట్టడంతో అడ్డంగా బుక్‌ అయ్యారు.

ఒట్టు వేయించుకొని మోసపోయి...

కిరణ్‌ తన పెట్టుబడిదారులకు రాసిన లేఖలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. పెట్టుబడిదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు భారీ స్థాయిలో కొత్త పెట్టుబడిదారుల ద్వారా నగదు సేకరించానని చెప్పుకొచ్చాడు. యానిమేషన్‌ ప్రాజెక్టులు లేకపోయినా లాభాలు పంచి ఇవ్వడంతో పెట్టుబడిదారులు తమ స్థోమతకు మించి డబ్బుల మూటలు తెచ్చి కిరణ్‌కు అప్పగించారట. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్న సమయంలో ఎవరైనా మా డబ్బులకు గ్యారెంటీ ఏంటి అని అడుగుతారు. కానీ యానిమేషన్‌ బాధితులు మాత్రం తాము పెట్టుబడి పెట్టినట్టు రెండో వ్యక్తికి తెలియకూడదని ఒట్టు వేయించుకున్నారని కిరణ్‌ తన లేఖలో తెలిపాడంటే పెట్టుబడిదారులు ఎంతటి మాయలో ఉన్నారో ఆర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు రూ.కోట్లకు కోట్లు తనకు ముట్టచెప్పడంతో యానిమేషన్‌ స్కాం ఏకంగా రూ.వెయ్యి కోట్ల దాకా వెళ్లింది. 2024 ఏప్రిల్‌ వరకు తాను చెబుతున్నవి అబద్ధాలు అని తెలిసినా వారికి లాభాలు పంచి ఇవ్వడంతో ఏ ఒక్కరూ నోరు విప్పలేదని తెలిపాడు. అంటే కిరణ్‌ మోసం చేస్తున్నా తమకు అధిక వడ్డీతో తిరిగి ఇస్తున్నాడన్న ఆశలో పెట్టుబడిదారులు పట్టించుకోలేదని అర్థమవుతోంది. ఎంతగా అంటే మాకు మరిన్ని లాభాలు కావాలి.. నువ్వు పెద్ద ప్రాజెక్టులు చేయి, మేం డబ్బులిస్తామని తనను ప్రోత్సహించారని కిరణ్‌ చొప్పుకొచ్చాడు. సమాజంలో మన మధ్యే తిరుగుతున్న కిరణ్‌ లాంటి ఎందరో మోసగాళ్ల బారినపడుకుండా ఉండాలంటే ప్రజలు అధిక లాభాలు, వడ్డీలకు మోసపోకుండా అప్రమత్తంగా ఉన్నప్పుడే మన కష్టార్జితానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

అధిక వడ్డీ ఆశ చూపి

ప్రజల నుంచి డబ్బు వసూలు

నమ్మకంగా ఏళ్ల తరబడి

వ్యాపారాల నిర్వహణ

రూ. వందల కోట్లు కొల్లగొట్టి పరారీ

వ్యాపారాల పేరిట ప్రజలను

మోసగిస్తున్న వైనం

పెరుగుతున్న యానిమేషన్‌

స్కాం బాధితుల సంఖ్య

నమ్మించి.. నిండా ముంచి..! 1
1/1

నమ్మించి.. నిండా ముంచి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement