మేయర్ ఎన్నిక ఏర్పాట్ల పరిశీలన
నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి ఎ.భార్గవ్ తేజ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సోమవారం జరగనున్న ప్రత్యేక సమావేశానికి సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. మేయర్ ఎన్నిక జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రెటరీ బి.శ్రీనివాసరావు, డీఎస్పీ అజీజ్, లాలాపేట సీఐ శివ ప్రసాద్‌లతో కలిసి పరిశీలించారు. పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10:30 గంటలకు తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని తెలిపారు. సభ్యులు మినహా ఇతరులను అనుమతించబోమని తెలిపారు. మొబైల్ ఫోన్‌లకు కూడా అనుమతి లేదన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ర్యాలీలు, గుంపుగా రావడానికి వీలు లేదని చెప్పారు. తగిన చర్యలను జీఎంసీ, పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.


