గుంటూరులో అర్ధరాత్రి ఐజీ, ఎస్పీ తనిఖీలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట నాలుగో లైన్‌లో గురువారం అర్ధరాత్రి గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ సతీష్ కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తదితర పోలీసు అధికారులు ఆకస్మికంగా పర్యటించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిబంధనలు అమలు, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, బహిరంగ మద్యపానం తదితర కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా కల్పించేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో జిల్లావ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


