21న పేటలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని టౌన్‌హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు గురువారం పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా నరసరావుపేటను ఎంపిక చేశామన్నారు. సాధారణంగా కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్ వేదిక మార్పును ప్రజలు గమనించాలని సూచించారు. ఏప్రిల్ మొదటి వారంలో చిలకలూరిపేట పట్టణంలో తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించామని గుర్తుచేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి స్పందన వచ్చిందన్నారు. 300 వరకు వినతులు అందాయని చెప్పారు.
సమీక్షకు హాజరైన కలెక్టర్, ఎస్పీ
గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాలు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీసీకి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఉచిత ఇసుక సరఫరా, సౌరవిద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ, వేసవి నేపథ్యంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపేందుకు ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఎంఎస్‌ఎంఈ సర్వే, నియోజకవర్గాలలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష జరిగింది.
మండలాల్లో ‘ఈ–వేస్ట్’ సేకరణ కేంద్రాలు
నరసరావుపేట: జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాలను ఈ నెల 19వ తేదీ నిర్వహించబోయే ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నాటికి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో కలెక్టర్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ–చెక్ అనే అంశాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, దానికి అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 13 శాఖలు భాగస్వాములు కావాలని, నిర్వర్తించాల్సిన విధులు, చేపట్టాల్సిన అంశాలను వివరించారు. గ్రామ, వార్డు స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను సైతం యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. వాటి ఆధారంగానే జిల్లాకు ర్యాంకింగ్ వస్తుందని తెలిపారు. చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ఆసుపత్రులు, మార్కెట్లు, పట్టణ కేంద్రాలను పరిశుభ్రం చేయాలని చెప్పారు. ఎన్‌జీఓలు, యువత, సామాన్య ప్రజలను సైతం పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని అన్నారు. పట్టణాలు, మండలాల్లో ఈ–వేస్ట్ సేకరణ కేంద్రాలను మహిళా స్వయం సహాయక సంఘాలే నిర్వహిస్తాయని చెప్పారు. దీనికోసం సభ్యులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్‌పై దృష్టి పెట్టాలని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టి తగిన ప్రాచుర్యం కల్పించాలని కోరారు. పీజీఆర్‌ఎస్ వినతులను అర్జీదారుడు సంతృప్తిపడేలా పరిష్కరించాలని చెప్పారు. అప్పుడే వారి నుంచి ప్రభుత్వానికి సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని స్పష్టం చేశారు. పింఛన్ సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని కోరారు.


