చికెన్ వల్ల ఎవరికీ బర్డ్‌ఫ్లూ సోకలేదు
నెక్ అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి
నరసరావుపేట: రాష్ట్రంలో కోళ్ల వల్ల బర్డ్‌ప్లూ సోకి మనుషులు మృతి చెందిన సంఘటనలు లేవని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్ ) అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి పేర్కొన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ చికెన్, గుడ్లు తిని దేశాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ప్లూతో మృతి చెందిన చిన్నారి ఆరాధ్య ఉదంతంపై కేంద్ర బృందం శుక్రవారం ఇక్కడకు వచ్చిన సమయంలో బాలస్వామి కూడా వచ్చారు. జరిగిన విషయం తల్లిదండ్రులు, స్థానిక వైద్యులు, పశుసంవర్ధకశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత 25 ఏళ్ల నుంచి బర్డ్‌ప్లూ కోళ్లకు వస్తున్నా మనుషులకు సంక్రమించిన దాఖలాలు లేవని అన్నారు. ఆరాధ్య మృతికి సంబంధించి పౌల్ట్రీ రంగంపై నిందలు వేయటం తగదన్నారు. బర్డ్‌ఫ్లూతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోళ్లు మృతి చెందినా, మనుషులకు ఈ వ్యాధి ఇప్పటివరకు సోకలేదని చెప్పారు. ఇటీవలనే తణుకులో రెండు లక్షల కోళ్లు, తెలంగాణలోని చౌటుప్పల్‌లో భారీగా కోళ్లు చనిపోయాయని గుర్తుచేశారు. వాటిని తొలగించి ఖననం చేసే కూలీలకు కూడా ఈ వ్యాధి సోకలేదని అన్నారు. చికెన్ తింటున్న వారికి సంక్రమించలేదని అన్నారు.
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తకు బెయిల్
క్రోసూరు: క్రోసూరుకు చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఎంపీటీసీ చిలకా ప్రసన్న భర్త చిలకా రవికి శుక్రవారం బెయిల్ లభించింది. గత శనివారం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై టీడీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ కేసు పెట్టగా... పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సహకారంతో న్యాయవాది సుబ్బారెడ్డి వాదించారు. దీంతో బెయిల్ వచ్చినట్లు రవి తెలిపారు.
చికెన్ వల్ల ఎవరికీ బర్డ్‌ఫ్లూ సోకలేదు


