ఏఎన్‌యూ(గుంటూరు) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్ రావు మంగళవారం విడుదల చేశారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31న తుది గడువుగా నిర్ణయించారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ర్యాంక్ పొందిన వారితోపాటు ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు అని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ లు తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డులను వర్సిటీ వైబ్సెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌యూసీడీఈ.ఇన్‌ఫో నుంచి పొందవచ్చన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వర్సిటీ ఓ ఎస్ డి ఆచార్య ఆర్ వి ఎస్ ఎస్ రవికుమార్, అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణవేణి, సూపరింటెండెంట్‌లు జవ్వాజి శ్రీనివాసరావు, నేలపాటి నాగేశ్వరరావు, వర్సిటీ సిబ్బంది రాధాకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


