కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం! | - | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం!

Jan 3 2026 7:11 AM | Updated on Jan 3 2026 7:11 AM

కొత్త

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం!

యడ్లపాడు: నాదెండ్ల మండలం చవిటిపాలేనికి చెందిన తలపాల కిరణ్‌బాబు(23)ది సామాన్య మధ్యతరగతి జీవితం. ఏడాదిన్నర క్రితమే లావణ్యతో వివాహమైంది. పెద్దగా చదువుకోకపోయినా, రెక్కల కష్టంతో భార్యను సుఖంగా చూసుకోవాలనుకున్నాడు. ‘కొత్త ఏడాదిలో మంచి పని చూసుకుంటాను, మనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మించుకుందాం’ అని భార్యకు మాటిచ్చాడు. కానీ, విధి మరోలా తలచింది. స్నేహితులతో కలిసి వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదం కిరణ్‌ను అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా మృత్యువు కబళించింది. ఇప్పుడు లావణ్య పరిస్థితి అగమ్యగోచరం. పెళ్లయిన ఏడాదిన్నరకే పసుపు కుంకుమలు దూరమై, ఒంటరిదైన ఆమెను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతోంది. అత్తమామల ఆసరా తప్ప ఆమెకు మరో భరోసా లేదు.

దిక్కులేని వారైన చిన్నారి పాపలు..

మరో విషాదం యడ్లపాడులో చోటు చేసుకుంది. షేక్‌ ఖాజావలి(30) తాపీ పనులు చేసుకుంటూ తన భార్య నాగూర్‌బి, ఇద్దరు కుమార్తెలను (8, 6 ఏళ్లు) ప్రాణప్రదంగా చూసుకునేవాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వచ్చిన ఒక్క ఇల్లు తప్ప మరో ఆస్తి లేదు. కొత్త ఏడాది రోజు కూడా కష్టపడి పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, మలుపు వద్ద ఎదురుగా వచ్చిన బైక్‌ రూపంలో మృత్యువు పలకరించింది. పనులు ముగించుకుని యడ్లపాడులోని స్వీట్‌ షాపులో పిల్లలకు స్వీట్లను తీసుకుని ఆనందంగా వస్తున్న క్రమంలో ఎదురుగా బైక్‌ ఢీకొన్ని తలకు తగిలిన బలమైన దెబ్బ ఖాజావలిని బలితీసుకుంది. తండ్రి వస్తే ఏదో ఒకటి తెస్తాడని ఎదురుచూసిన ఆ పసి ప్రాణాలకు, తండ్రి లేడన్న చేదు నిజం ఇంకా అర్థం కావడం లేదు. భర్తను కోల్పోయిన నాగూర్‌బి, రేపటి రోజున ఆ ఇద్దరు ఆడపిల్లలను ఎలా పెంచాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు నిండుకున్న మధ్య తరగతి మనిషి కలలపై జరిగిన దాడి.. ఈ ప్రమాదాలు. రెక్కాడితే గాని డొక్కాడని’ జీవితాల్లో ఒక మనిషి దూరం కావడం అంటే ఆ కుటుంబం పునాదులే కదిలిపోవడమే. పండుగ రోజున విషాదం నిండటం ఆ కుటుంబాలను కోలుకోలేని దెబ్బ తీసింది.

లోకమంతా కొత్త ఆశలతో..సంబరాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటే.. ఆ రెండు ఇళ్లల్లో మాత్రం విధి వంచన చేసింది. క్యాలెండర్‌ మీద మారిన తేదీ ఆ కుటుంబాల్లో వెలుగులు నింపాల్సింది పోయి, తీరని చీకటిని మిగిల్చింది. గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. కట్టుకున్న వారు కన్నీరుమున్నీరవుతుంటే, అండగా నిలవాల్సిన చేతులు అచేతనంగా పడి ఉండటం చూసి స్థానికుల కళ్లు చెమర్చుతున్నాయి.

రెండు కుటుంబాల్లో ఆరిన ఆశల దీపాలు

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం! 1
1/3

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం!

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం! 2
2/3

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం!

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం! 3
3/3

కొత్త ఏడాది.. కోలుకోలేని గాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement