పొగాకుపై పన్నులు పెంచటం నష్టదాయకం
చిలకలూరిపేట: పొగాకు, పొగాకు సంబంధ ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎస్ మురళి ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణం ఎన్‌ఆర్‌టీ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై పొగాకు రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సెంట్రల్ ఎకై ్సజ్ సవరణ చట్టం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించటం జరిగిందన్నారు. దీని వలన పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ రేటుకు అదనంగా జాతీయ భద్రతా సెస్సు, హెల్త్ సెస్సు, ఎకై ్సజ్ డ్యూటీ పెరుగుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవం వేరేగా ఉందని విమర్శించారు. ఒక వైపు మార్కెట్‌లో ఎలాంటి లైసెన్సులు లేకుండా చౌకబారు విదేశీ సిగరెట్లు విచ్చలవిడిగా లభిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విధించే అదనపు పన్నుల వలన దేశీయంగా పొగాకు ఉత్పత్తుల రేట్లు మరింతగా పెరిగి, విదేశీ స్మగ్లింగ్ సిగరెట్ల బెడద మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని వల్ల దేశీయంగా పొగాకు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్సులు లేకుండా దేశంలోకి వస్తున్న విదేశీ సిగరెట్లను నియంత్రించలేని ప్రభుత్వం పొగాకుపై విచ్చలవిడిగా పన్నులు విఽధించటం ద్వారా పొగాకు రైతుల వెన్ను విరిచేందుకు సిద్ధమౌతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అతిగా విఽధించే పన్నులు వినియోగాన్ని తగ్గించలేవని, బదులుగా అక్రమ వ్యాపారం పెరిగి ప్రభుత్వానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు పొగాకుకు ప్రత్యామ్నాయం లేక, ఏ పంట పండించాలో తెలియక పొగాకు రైతులు దారుణంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న పొగాకు పన్ను విధానం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పొగాకు రైతులపై వివక్షను చూపుతోందని ఆరోపించారు. ఈ విధమైన తీవ్ర అసమానత, నిబంధనలు పాటిస్తూ చట్టబద్దంగా సాగుచేసే రైతులను శిక్షించే విధంగా ప్రభుత్వ విధానం మారిందని, యావత్ పొగాకు రైతులు ఆందోళనకు దిగాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఆర్ శ్రీకాంత్, వి వరప్రసాద్, జి వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, భాస్కర్ చౌదరి పాల్గొన్నారు.


