జీవాలపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం
చిలకలూరిపేటటౌన్: జీవాలపైకి టాటా ఏస్ వాహనం దూసుకు వెళ్లడంతో 12 గొర్రెలు మృతి చెందాయి. పలు గొర్రెలు తీవ్రగాయాలైన పాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ...కట్టుబడివారిపాలెం పరిధిలోని మోపూరివారిపాలెం గ్రామానికి చెందిన ఉయ్యాల ఏడుకొండలు తమ గొర్రెల మందను తోలుకుని వెళ్తున్న క్రమంలో కోటప్పకొండ సమీపంలోని ఈటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మేతకు ముగించుకుని మంద తిరిగి ఇంటికి తరలి పోతున్న క్రమంలో డోర్నాల నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న టాటా ఏస్ మినిలారీ ఒక్కసారిగా మందపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో 11 గొర్రెలు, ఒక పొట్టేలు మృత్యువాత పడగా, మరో 21 గొర్రెలు గాయాల పాలయ్యాయి. వాహనం నిలుపుదల చేయకుండా పరారయ్యే క్రమంలో స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో మద్దిరాల గ్రామస్తులు అప్రమత్తమై నిలపుదల చేశారు. దీంతో బాధితుడు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు.


