ఆ రోడ్డు.. రెండు జిల్లాలది..!
బల్లికురవ: సిమెంట్ రోడ్డు రెండు జిల్లాలకు హద్దుగా మారింది. ఈ రోడ్డు ఉత్తరం వైపు ప్రకాశం జిల్లా.. దక్షిణం వైపు బాపట్ల జిల్లాలోకి చేరడంతో అయోమయం నెలకొంది. బల్లికురవ నుంచి నక్క బొక్కలపాడు– కొణిదన– రాజుపాలెం మీదుగా ఎన్‌హెచ్ 16ను కలిపే లింకు రోడ్డు ఉంది. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం రోడ్డు ఉత్తర భాగంలో.. మార్టూరు మండలంలో ఉన్న రాజుపాలెం దక్షిణ భాగంలోకి చేరింది. కె.రాజుపాలెంలో 920 మంది ఓటర్లు, రాజుపాలెంలో 2,400 మంది ఓటర్లున్నారు. మొన్నటి వరకు రెండు మండలాలు బాపట్ల జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అంటే మార్టూరు మండలంలోని రాజుపాలెం పర్చూరు నియోజకవర్గంలో.. బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం అద్దంకి నియోజకవర్గంలో చేరి ఉన్నాయి. ఇటీవల జిల్లాల పెంపు సర్దుబాటులో భాగంగా బల్లికురవ మండలంలోని కె.రాజుపాలెం ప్రకాశం జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ అద్దంకిలో చేరింది. మార్టూరు మండలంలోని రాజుపాలెం బాపట్ల జిల్లాలోకి.. రెవెన్యూ డివిజన్ చీరాల్లోకి వెళ్లింది. అయితే కె.రాజుపాలెం వాసులకు పొలాలన్నీ మార్టూరు మండల పరిధిలోకి చేరడంతో.. రెవెన్యూ పనులకు చీరాల వెళ్లక తప్పదని రైతులు చెబుతున్నారు. అధికారులు తికమక పడుతున్నారు. కాగా కె.రాజుపాలెంలో టీ దుకాణాలు కూడా లేకపోవడంతో రోడ్డు దాటి పక్క జిల్లా అయిన బాపట్లకు వెళ్లాల్సి రావడం కొసమెరుపు.


