● పోలీసు పీజీఆర్‌ఎస్‌లో బాధితుల మొర ● 80 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్యపై శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులచే కుటుంబ, ఆస్తి, చోరీలు, మోసాలకు చెందిన 80 ఫిర్యాదులు స్వీకరించారు.
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.20లక్షలు మోసం
నాకు 2019లో వాంకడావత్ వసంతరావు నాయక్ అనేవ్యక్తి ఎంపీడీఓగా పరిచయమై ప్రస్తుతం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో పనిచేస్తున్నట్లు నమ్మబలికాడు. నా మరదలు కుమారుడైన చింత దానయ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని దానికి గాను సుమారు రూ.20లక్షలు వరకు ఖర్చు అవుతుందని, ఆ డబ్బులు ఇస్తే పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని, ముందు డబ్బులు ఇస్తే తాను ప్రిన్సిపల్ సెక్రెటరీ దగ్గర నుంచి కలెక్టర్ దాకా డబ్బులు ఇచ్చుకుంటూ రావాలని ఆ తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి రూ.20లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికి ఆరేళ్లు గడిచినా ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడు. తగిన న్యాయం చేసి, మోసం చేసిన వ్యక్తిని అరెస్టుచేసి శిక్షించండి.
– భీముని వెంకటరావు, వినుకొండ
క్రెడిట్ కార్డుకోసం
ఫోన్‌చేసి మోసం..
నేను పట్టణంలోని ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాను. ఓ అజ్ఞాత వ్యక్తి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు కావాలా అంటూ కాల్ చేశాడు. నాకు అవసరంలేదని చెప్పాను. జనవరి 21వ తేదీన ఓ వ్యక్తి బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పగా ఆ కాల్ కట్ చేశాను. తరువాత నా వాట్సాప్‌కు ఒక లింక్ పెట్టగా తెలియక ఆ లింక్ ఓపెన్ చేశా. ఆ తర్వాత నా ఫోను ఆ అజ్ఞాత వ్యక్తి కంట్రోల్ లోకి వెళ్లింది. నా బ్యాంకు అకౌంట్ ద్వారా నగదు లావాదేవీలు చేశాడు. అతనిపై సైబర్ క్రైం ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి శిక్షించండి.
– బొడ్డపాటి వెంకటేశ్వరరావు, అల్లూరివారిపాలెం,
నరసరావుపేట మండలం
యాడ్ ఏజెన్సీ పేరుతో
రూ.33లక్షలు కాజేశాడు
నేను ఓఏల్‌ఎక్స్ వెబ్‌సైట్‌లో కెమెరా రోజువారీ అద్దెకు ఇస్తానని పెట్టగా, సెప్టెంబర్ నెలలో కండ్రిక గ్రామానికి చెందిన సాగర్‌బాబు ఆన్‌లైన్‌లో పరిచయమై మీ కెమెరాను నేను అద్దెకు ఇప్పిస్తానని, తాను సినిమాలకు స్క్రిప్ట్‌లు రాస్తానని, నాకు జబర్దస్త్ ప్రోగ్రాం వారు కూడా తెలుసునని, తాను అందులో పనిచేస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం కలిసి యాడ్ ఏజెన్సీ పెడదామని చెప్పి నా వద్ద నుంచి రూ.33లక్షలు ఆన్‌లైన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడి నుంచి స్పందన లేకపోవటంతో మోసపోయానని గ్రహించి పెద్ద మనుషులను తీసుకొని అతను వద్దకు వెళ్లగా డబ్బులు తీసుకున్న మాట నిజమేనని ఒప్పుకొని నెలకు రూ.50వేలు ఇస్తాని ఒప్పుకొన్నాడు. ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. గట్టిగా అడిగితే తిరిగి నాపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించండి.
– రెడ్డిమాసు దిలీప్‌కుమార్,
రావిపాడు, నరసరావుపేట మండలం