జిల్లా మత్యశాఖ అధికారి సంజీవరావు
విజయపురిసౌత్: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు అన్నారు. మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో మాచర్ల మండలం అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి 10 లక్షల చేప పిల్లలను సోమవారం విడుదల చేశారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వారంలో సైతం 10 లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలి వలలుతో చేపల వేట చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మత్స్య సంపదను కాపాడుకోవాలని సూచించారు. ఎఫ్‌డీఓ టీవీఏ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఏఓ జగదీష్, మత్స్యశాఖ తనిఖీ అధికారి వెంకట రమణ, గ్రామ మత్స్య సహాయకులు లీలావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
27న ఉప సర్పంచ్
పదవులకు ఎన్నికలు
నరసరావుపేట: జిల్లాలోని 17 మండలాల్లోని 44 గ్రామ పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం నరసరావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 11గంటలకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 6,041 క్యూసెక్కులు విడుదలవుతోంది.
నేడు గుంటూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
గుంటూరు లీగల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇ.ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
రుక్మిణీ అలంకారంలో
నృసింహుడు
మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీ నృసింహస్వామి సోమవారం రాత్రి రుక్మిణీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. మంగళవారం స్వామి స్థంభోద్భవం అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం