● జిల్లా పోలీసు కార్యాలయంలో ముస్లిం పోలీసులకు ఇఫ్తార్ విందు ● జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
నరసరావుపేట: పండుగ అనేది ఏ మతానికి సంబంధించినది అయినా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని , ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి బోధిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రంజాన్ ఉపవాస దినాలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలో ముస్లిం పోలీసులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి రోజాను విరమింపచేశారు. ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రాముఖ్యత, రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే విధానం గురించి తెలియజేశారు. చాంద్ర మానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ తొమ్మిది నెల రంజాన్ అని, దీన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ నెలలోనే దివ్య ఖురాన్ గ్రంథం అవతరించడమేనని ఆయన వివరించారు. ఈ మాసంలో ముఖ్యమైనవి రోజా, తరావి నమాజ్ అన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించినది రంజాన్ మాసంలోనే అవ్వడంతో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఫిత్ర, జకాత్ దానధర్మాలు చేస్తుంటారని ఎస్పీ వివరించారు. అనంతరం ముస్లింలతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు పరిపాలన ఎస్పీ జేవీ.సంతోష్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, వెల్ఫేర్ ఆర్‌ఐ గోిపీనాథ్, జిల్లాలోని ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


