నకరికల్లు: అధికార అహంకారంతో తమ గుడిసెలను కూల్చేసిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. గుడిసెలు కూలగొట్టి భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని మండలంలోని బాలాజీనగర్ తండాకు చెందిన పలువురు సుగాలీలు పీడీఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుటఽ ఆందోళనకు దిగారు. బాధితుల తరఫున పీడీఎం పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి మాట్లాడారు. తండాకు చెందిన 37 సుగాలి కుటుంబాలకు మూడు సెంట్లు చొప్పున 1989లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అంతా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాట్రావత్ సాంబయ్య నాయక్ 2022లో గుడిసెలకు నిప్పంటించాడు. అతనిపై కేసు నమోదు కాగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాడు. అనంతరం తిరిగి సుగాలీలకే పట్టాలు మంజూరు చేయాలని హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. దీంతో కొందరు తిరిగి గుడిసెలు నిర్మించుకొని నివాసముంటున్నారు. అప్పటి నుంచి ఊరుకున్న సాంబయ్య నాయక్ ప్రస్తుతం టీడీపీ అండతో, తండాలో ఎవరూలేని సమయం చూసుకొని పొక్లెయిన్‌తో గుడిసెలను కూలగొట్టాడు. దీంతో బాధితులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కోర్టు ఉత్తర్వుల ఉన్నప్పటికీ గుడిసెలు కూల్చిన సాంబయ్య నాయక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కె.పుల్లారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్.శివానాయక్, పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పి.రామునాయక్, పి.సాంబబాయి, కేతావత్ శ్రీరాములు నాయక్, వి.బాలసింగ్‌నాయక్, కె.కృష్ణనాయక్, కె.రమాదేవి, ఆర్.హనుమానాయక్, ఆర్.మణిబాయి పాల్గొన్నారు.
అధికార అహంకారంతో పేదల గుడిసెలు కూల్చివేత ఆందోళనకు దిగిన బాధితులు
కోర్టు ఆదేశాల మేరకు చర్యలు
బాలాజీనగర్‌తండాకు చెందిన ఎస్టీలు ఇచ్చిన అర్జీని పరిశీలించాను. భూ సమస్యపై ఇరువర్గాలు హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– కె.పుల్లారావు, తహసీల్దార్, నకరికల్లు