● వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ● వినుకొండలో నాయకుడి అక్రమ నిర్బంధంపై మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడితో కలసి సమావేశం ● ఈపూరు మండల నాయకుడు నాగేశ్వరరావు అక్రమ నిర్బంధంపై హైకోర్టులో పిటిషన్ ● రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు హత్యలు తప్పా పరిపాలన ఎక్కడని పొన్నవోలు ప్రశ్న ● హిట్లర్‌ను మరపిస్తున్న చంద్రబాబు పాలన
వినుకొండ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు కొండావర్జు నాగేశ్వరరావు యాదవ్‌ను ఈపూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని దాచిపెట్టడంపై ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా చొరవతో తమ నాయకుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విషయం తెలిసిన వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరై నాగేశ్వరరావును విడిచిపెట్టారని వివరించారు. కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను వేధించడం, భూములు లాక్కోవడం, హత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు నిత్య కృత్యంలా మారాయని తెలిపారు. వినుకొండలో రషీద్ దారుణహత్యతోపాటు, వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెంలో మహిళపై అత్యాచారం కేసుల్లో ఇప్పటివరకూ పోలీసులు పురోగతి సాధించలేదని విమర్శించారు. హిట్లర్ పాలన కంటే దారుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఒక మీడియా చానల్‌లో ప్రభుత్వ పథకాలపై మాట్లాడిన నాగేశ్వరరావును తీవ్రవాదుల కంటే దారుణంగా పొలంలో పని చేసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకోవడం ఏమిటని పొన్నవోలు ప్రశ్నించారు. పోలీసులు నాగేశ్వరరావును స్టేషనులో కాకుండా వేరేచోట నిర్బంధించి కుటుంబసభ్యులకు కూడా తెలియకుండా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. నాగేశ్వరరావు భార్య సునీత, గ్రామస్తులు, బంధువులు పోలీస్టేషన్‌లో కాపలాగా ఉండి అతడిని కాపాడుకున్న తీరు అభినందనీయమన్నారు. ఈ ఘటనతో జగన్ మాటల మనిషికాదని, చేతల మనిషి అని, సామాన్య కార్యకర్తలకు అన్యాయం జరితే ఆయన స్పందించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, జిల్లా లీగల్‌సెల్ కన్వీనర్ మాధవితోపాటు, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్ కృషి మరువలేనిదన్నారు. ప్రభుత్వం తమ కార్యకర్తలను ఎంత అణగదొక్కాలని చూస్తే అంతే వేగంగా చైతన్యవంతులు అవుతారని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను ఇలా కూడా వాడుకోవచ్చని చంద్రబాబు ప్రభుత్వ విధానం చూస్తుంటే అర్థమవుతోందని తెలిపారు. వారు ట్రైలర్ మాత్రమే చూపించారని, రానున్న రోజుల్లో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. వినుకొండను అనకొండగా మార్చిన టీడీపీ నాయకులకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని పొన్నవోలు పేర్కొన్నారు.
ధైర్యంగా ఉండండి : బొల్లా
బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పొన్నవోలు లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నతకాలం భయపడేది లేదన్నారు. వినుకొండలో పేదలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. శావల్యాపురం మండలంలోని వెలమావారిపాలెంలో సాగునీరు అడిగినందకు మహిళపై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి, ఎం.ఎన్. ప్రసాద్, సీనియర్ నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి రాజా, మున్సిపల్ వైస్ చైర్మన్ బేతం గాబ్రియేలు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.