నరసరావుపేటటౌన్: సాయి సాధన చిట్ ఫండ్ స్కాం కేసు గుంటూరు సీఐడీ కోర్టుకు బదిలీ అయ్యింది. సుమారు 600 మంది చిట్స్ సభ్యులు, డిపాజిట్ దారులను భారీస్థాయిలో మోసగించినట్లు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్బారెడ్డి ఫిర్యాదుతో నెల కిందట వన్‌టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇందులో గ్రావిటీని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సీఐడీకి అప్పగించడంతో పాటు కొన్ని ప్రత్యేక చట్టాలను కూడా జత పరిచింది. దీంతో కేసును సీఐడీ కేసుల విచారణ కోర్టు అయిన గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బుధవారం గుంటూరు సీఐడీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. దీంతోపాటు 13వ అదనపు జిల్లా కోర్టులో పాలడుగు పుల్లారావు కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బదిలీ అయింది. కాగా పాలడుగు పుల్లారావుతో పాటు చిట్‌ఫండ్‌లో భాగస్వాములుగా ఉన్న ఆయన భార్య వాణిశ్రీ , కుమారుడు పవన్ కుమార్, కుమార్తె శ్రీహర్షవర్ధిని, అల్లుడు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ నూకవరపు రాజా రమేష్, నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన గాలి కోటయ్యలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. పుల్లారావు ఇప్పటికే కోర్టులో లొంగిపోయి జైల్లో ఉండగా, మిగిలిన వారు పరారీలో ఉండి, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
దాచేపల్లి : మండలంలోని పొందుగల రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం నుంచి తల వేరు అయింది. శరీరంపై నలుపు రంగు బనియన్, ప్యాంట్ ఉంది. సంఘటన స్థలాన్ని జీఆర్పీ ఏఎస్‌ఐ వెంకట్రామయ్య, కానిస్టేబుల్ రామరాజు పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలకు 9440438256, 9949063960 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.