నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ఎంతమంది లబ్ధిదారులకు, ఏఏ బ్యాంకులు ఎంత రుణాలు ఇచ్చాయో సవివరంగా నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్‌ని కోరారు. గురువారం కలెక్టర్ కర్యాలయంలో గతేడాది డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరులుగా మండలాల్లో కూడా ఒక బ్యాంక్ ఉండాలన్నారు. తద్వారా మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసుకొని లబ్ధిదారులకు సులభంగా పథకాలపై అవగాహన కలిగించి లబ్ధి చేకూర్చవచ్చని అభిప్రాయపడ్డారు. పీఎంజేజేవై, పీఎం జనధన్ యోజన వంటి పథకాలలో ఎన్ని పనిచేస్తున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన వారందరికీ రుణాలు ఇచ్చేలా చూడాలన్నారు. బ్యాంకర్లు తమ తమ పరిధిలో వ్యవసాయ పొలాల్లో రోడ్లు వేసేందుకు సీఎస్‌ఆర్ నిధులు అందించేలా చూడాలన్నారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్‌్ టి.మాధురి తొలుత సమావేశం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాం ప్రసాద్ డిసెంబర్–2024 నాటి త్రైమాసిక నివేదికను పీపీటీ ద్వారా వివరించారు. ఆర్‌బీఐ అధికారి సీహెచ్ నవీన్, నాబార్డు డీడీఎం శరత్ బాబు, వివిధ బ్యాంకుల కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
బ్యాంకు అధికారులను కోరిన
కలెక్టర్ అరుణ్‌బాబు, ఎంపీ లావు


