8 రోజుల అనంతరం తెనాలికి చేరిన రవితేజ మృతదేహం | - | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి తెనాలికి రవితేజ మృతదేహం

Jul 27 2024 3:00 AM | Updated on Jul 27 2024 11:47 AM

-

ఈనెల 18న అమెరికాలో మృతి 

తెనాలిరూరల్‌: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన తాడిబోయిన రవితేజ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. అమెరికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్న రవితేజ భౌతికకాయాన్ని అంబులెన్స్‌ ద్వారా తెనాలి తీసుకు వచ్చారు. ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ పూల్‌లో పడి రవితేజ మృతి చెందిన విజయం తెలిసిందే.

 రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి కొడుకుకు మంచి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసింది. ఓవైపు చదువుకుంటూనే కోకోకోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడపెట్టుకున్న రవితేజ ఎంఎస్‌ కోసం గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. అక్కడ టెక్సాస్‌లో ట్రైన్‌ యూనివర్శిటీలో ఎంఎస్‌ చేస్తూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్నేహితులతో కలిసి అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాదాపు ఎనిమిది రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం రవితేజ భౌతికకాయం తెనాలి చేరుకుంది. 

తెనాలిలో భారీ ఊరేగింపుగా రవితేజ భౌతికకాయాన్ని ఐతానగర్‌లోని నివాసానికి తీసుకువెళ్లారు. రజక చెరువు సెంటర్‌ నుంచి లింగారావు సెంటర్‌ మీదుగా రవితేజ నివాసానికి రాత్రికి భౌతికకాయం చేరుకుంది. రవితేజ భౌతిక భౌతికకాయాన్ని చూసి తల్లి జయలక్ష్మి, సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబానికి చెందిన తాము కొడుకు ప్రయోజకుడవుతాడని అమెరికా పంపిస్తే అనుకోని ప్రమాదంలో అతడు మృతి చెందాడంటూ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి జయలక్ష్మి గుండెల విసేలా రోదించారు. శనివారం ఉదయం రవితేజ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement