మహమ్మారికి మందు

జీజీహెచ్‌ నాట్కో  క్యాన్సర్‌ సెంటర్‌ భవన సముదాయం - Sakshi

గుంటూరు మెడికల్‌: పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్‌ వ్యాధి వస్తే వారికి మరణమే శరణ్యం. నేడు ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తున్నారు. వ్యాధి ఎలా సోకుతుంది, ఎలా గుర్తించాలి తదితర ప్రాథమిక విషయాలపై అవగాహన ఏర్పరచి ప్రజల్లో క్యాన్సర్‌ పట్ల ఉన్న అపోహలు పోగొట్టేందుకు 2000 ఫిబ్రవరి 4న ప్యారిస్‌లో ప్రపంచ దేశాల క్యాన్సర్‌ వైద్యుల సమావేశం జరిగింది. నాటి నుంచి ప్రతి ఏడాదీ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4 వరల్డ్‌ క్యాన్సర్‌ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’అందిస్తున్న ప్రత్యేక కథనం.

రాష్ట్రంలో మొదటి క్యాన్సర్‌ సెంటర్‌
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాన్సర్‌ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం, నాట్కో ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో సుమారు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో వంద పడకలతో క్యాన్సర్‌ వార్డు నిర్మించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1–7–2020న వర్చువల్‌ విధానంలో నన్నపనేని లోకాదిత్యుడు, సీతారావమ్మ స్మారక క్యాన్సర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ వైద్య సౌకర్యాలతో ప్రత్యేకంగా క్యాన్సర్‌ వార్డు నిర్మించిన మొట్టమొదటి ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్‌ రికార్డు సృష్టించింది. క్యాన్సర్‌ రోగులకు తొలి రిఫరల్‌ ఆస్పత్రిగా కూడా గుంటూరు జీజీహెచ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా రూ.60లక్షలతో థియేటర్స్‌ నిర్మించారు.

జీజీహెచ్‌ క్యాన్సర్‌ వార్డు ప్రత్యేకతలు
ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో ఐదు అంతస్తుల్లో క్యాన్సర్‌ సెంటర్‌ నిర్మాణం జరిగింది. రేడియేషన్‌ ఆంకాలజి, మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ డిపార్టుమెంట్‌, రేడియోథెరఫీ డిపార్టుమెంట్‌, సర్జికల్‌ ఐసీయూ, మెడికల్‌ ఐసీయూ గదులు ఏర్పాటు చేశారు.

ఆధునిక వైద్య పరికరాలు
క్యాన్సర్‌ రోగులకు ఆధునిక వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల ఖరీదు చేసే వైద్య పరికరాలను జీజీహెచ్‌కు అందజేసింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే లీనియర్‌ యాక్సిలేటర్‌ వైద్య పరికరాన్ని, రూ.2 కోట్లు ఖరీదు చేసే బ్రాకీథెరపీ, రూ.5.50 కోట్ల సీటీ స్టిమ్యులేటర్‌ వైద్య పరికరాలు ప్రభుత్వం విదేశాల నుంచి తెప్పించింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే పెట్‌ సీటీ వైద్య పరికరాన్ని సైతం మంజూరు చేసింది. త్వరలోనే వైద్య పరికరం ఆస్పత్రికి రానుంది. నాట్కో ట్రస్ట్‌ కోటి రూపాయలతో మామోగ్రామ్‌ వైద్య పరికరం అందుబాటులోకి తెచ్చింది. అన్ని రకాల ఆపరేషన్లు చేసేందుకు కోటి రూపాయలతో మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణం చేశారు.

అందుబాటులో ఆధునిక వైద్యం

క్యాన్సర్‌ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు గుంటూరు జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. మంత్రి విడదల రజిని, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, డీఎంఈ డాక్టర్‌ నరసింహం, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

– డాక్టర్‌ ఏకుల కిరణ్‌కుమార్‌, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

100 పడకలతో మరో క్యాన్సర్‌ భవనం

నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో అందుతున్న వైద్యసేవలను ప్రభుత్వం గుర్తించి లెవల్‌–1 క్యాన్సర్‌ సెంటర్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రభుత్వం ఇటీవల కాలంలో 1250 గజాల స్థలాన్ని నాట్కో ట్రస్టుకు కేటాయించింది. ఆ స్థలంలో సుమారు రూ.12 కోట్లతో 100 పడకలతో మరో భవన నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వానికి నాట్కో ట్రస్ట్‌ ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తోంది.

– నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌

ఉచితంగా క్యాన్సర్‌ మందులు

క్యాన్సర్‌ రోగులకు నాట్కో ట్రస్ట్‌ ప్రతి ఏడాదీ రూ.2 కోట్ల ఖరీదు చేసే మందులు ఉచితంగా అందిస్తుంది. రోగులకు మెరుగైన వైద్యం, కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు ట్రస్ట్‌ నిర్వాహకులు డాక్టర్‌ వీసీ నన్నపనేని కార్యక్రమాలు చేస్తున్నారు.

– యడ్లపాటి అశోక్‌కుమార్‌, నాట్కో ట్రస్ట్‌ కోఆర్డినేటర్‌

whatsapp channel

Read latest Palnadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top