కళక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

కళక్టరేట్‌

Nov 18 2023 2:00 AM | Updated on Nov 18 2023 2:00 AM

- - Sakshi

సాక్షి, నరసరావుపేట : రణతంత్రపుటెత్తులతో ఒకనాడు రాజకీయ చదరంగాన్ని కనుచూపుతో శాసించిన ధీరనారి నాయకురాలు నాగమ్మ పౌరుషం, చాపకూటి సిద్ధాంతంతో సమానత్వాన్ని చాటిన బ్రహ్మనాయుడు ఔదార్యం, ఆధ్మాత్మికతను శిరస్సున ధరించిన కోటప్పకొండ క్షేత్రం వైశిష్ట్యం.. అలనాటి రాజసాన్ని చాటే కొండవీటి కోట సౌందర్యం, కర్షకుడి చెమట చుక్కల్లో తడిచి మెరిసిన పత్తి, మిరపల సమాహారం, బీడులను సస్యశ్యామలం చేసే దుర్భిక్ష నాశిని నాగార్జున సాగర్‌ జల సోయగం.. బౌద్ధం శరణం గచ్ఛామి అంటూ నినదించిన అమరావతి ధ్యాన సౌరభం.. హరిత హారతి పట్టినట్టు చుట్టూ అబ్బురపరిచే పచ్చదనం.. సాదర స్వాగతం పలుకుతున్నట్టు పూర్ణకుంభం, తెలుగుతల్లి ప్రతిమల చిరుదరహాసం.. ఇలాంటి సుమనోహర దృశ్యమాలికలతో కలెక్టరేట్‌ కొత్త కళను సంతరించుకుంది. పౌరుషాల గడ్డ చరిత్రను కళ్లకు కడుతోంది. సందర్శకులను సమ్మోహితులను చేస్తోంది. పల్నాటి వైభవాన్ని చాటుతోంది. పల్నాడు తొలి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు శివశంకర్‌ లోతేటి విశేష కృషిచేస్తున్నారు. ఓ వైపు ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆహ్లాదంగా, అందంగా తీర్చదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. అనుకున్నది సాధించారు. కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని నయనమనోహరంగా తీర్చిదిద్దారు.

అబ్బురపరిచే మనకీర్తి ‘చిహ్నాలు’

కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర చిహ్నాల శిల్పాలను సుందరంగా చెక్కించారు. మన కీర్తిని చాటేలా అందమైన కళారూపాలుగా మలిచారు. ఇందులో పూర్ణకుంభం, నాలుగు సింహాలు, రాష్ట్ర పక్షి రామ చిలుక, రాష్ట్ర మత్స్యం కొర్రమీను, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర ఫలం మామిడి, రాష్ట్ర వృక్షం వేప, పుష్పం మల్లెలను సుందరంగా రూపుదిద్దారు.

తెలుగు తల్లికి మంగళహారతి

కలెక్టర్‌ కార్యాలయంలో రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట వినిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పాట వింటుంటే గుండెల్లో తెలుగు మాధుర్యం ఉప్పొంగినట్లు సందర్శకులు భావిస్తున్నారు. దీంతోపాటు కొత్త కలెక్టర్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన జిల్లా అధికారుల పేర్లు శాశ్వతంగా ఉండేలా శిలాఫలకం వేయించారు. ఇది తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ముఖ్య కార్యాలయానికి

కొత్త సొబగులు

ఆకట్టుకుంటున్న పౌరుషాల

గడ్డ చారిత్రక చిత్రాలు

జాతీయభావం ఉట్టిపడేలా చిహ్నాలు

నిత్యం తెలుగు తల్లికి మంగళహారతులు

పల్నాడు జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా

ఘన చరిత్ర కలిగిన పల్నాడు జిల్లాకు తొలి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. ఇది రాళ్ల సీమ కాదు.. రతనాల్లాంటి మనుషుల ఖిల్లా. కొత్తగా పురుడుపోసుకున్న జిల్లా ముఖ్య కార్యాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని సంకల్పించాం. అందుకే పల్నాటి చరిత్రతోపాటు జాతీయతాభావం ఉట్టిపడేలా చిహ్నాలను ఏర్పాటు చేశాం. కలెక్టర్‌ కార్యాలయానికి సమస్యలతో వచ్చిన వారు చిరునవ్వుతో వెళ్లాలనే దృక్పథంతో సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికీ పెద్ద పీట వేస్తున్నాం.

– శివశంకర్‌ లోతేటి,

పల్నాడు జిల్లా కలెక్టర్‌

కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్ణకుంభం, రాష్ట్ర చిహ్నాలు 1
1/3

కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్ణకుంభం, రాష్ట్ర చిహ్నాలు

 కలెక్టరేట్‌లో కొత్తగా వేసిన తారు రోడ్డు2
2/3

కలెక్టరేట్‌లో కొత్తగా వేసిన తారు రోడ్డు

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement