ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

Odisha: Covid Patient On Tree In Medigaon Village - Sakshi

జయపురం: కరోనా పాజిటివ్‌ నమోదైన ఓ బాధితుడు నవరంగపూర్‌ జిల్లా చందాహండి సమితి గంభారిగుడ పంచాయతీ మెడిగాం గ్రామంలో  చెట్టు కింద ఆశ్రయం పొందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సమితికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నమోదు కావడంతో హోం క్వారెంటైన్‌లో ఉండమని వైద్యులు సూచించారు. అయితే ఆ వ్యక్తికి హోం క్వారంటైన్‌ అవకాశం లేకపోవడంతో మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందాడు. దీంతో మెడిగాం గ్రామస్తులు వణికిపోతున్నారు.

వైద్యాధికారులు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌ నమోదైన వారిని గాలికి వదిలేస్తున్నారని  హోం క్వారంటైన్‌లో ఉండే అవకాశం లేని వారికి తగిన ఏర్పాట్లు చేయాలి కానీ గాలికి వదిలేయకూయడదని మండిపడుతున్నారు. కరోనా రోగులు చెట్ల కింద ఉంటే ఇతరులకూ కరోనా సంక్రమించే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమితిలోని హలదిగ్రామంలో 100 పడకల కోవిడ్‌ కేర్‌ హాస్పిటల్, పనాబెడ డిగ్రీ కళాశాల, సాలెబిడి ఆశ్రమంలో రెండు టీఎంసీ (తాత్కాలిక వైద్య కేంద్రం) లు ఉన్నా తమ గ్రామంలో  చెట్టు కింద కరోనా రోగి ఉండడానికి  కారణం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.  దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని  డిమాండ్‌ చేస్తున్నారు.

సహాయం చేస్తున్న గ్రామ యువత
చెట్టు కింద ఉంటున్న కరోనా రోగికి తిండి, మందులు  ఎవరూ సమకూర్చడం లేదు. ఆ రోగి పరిస్థితి చూసి చలించిన మెడిగాం గ్రామానికి చెందిన యువకులు తినేందుకు, తాగేందుకు సమకూర్చారు. అలాగే రోగికి దూరంగా ఉండి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అవసరమైన మందులు తెచ్చి ఇస్తున్నారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top