కరోనా పేషెంట్‌కు నకిలీ రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చిన కేసులో కోర్టు తీర్పు
నిజామాబాద్ లీగల్: నకిలీ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేసి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన మేల్ నర్సు, డాక్టర్‌కు నిజామాబాద్ ప్రిన్సిపల్ డి్రస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి పదేళ్ల జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధించారు. 2021లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్‌కు చెందిన కొండ్ర మహేశ్‌బాబు కరోనా చికిత్స కోసం ఆర్మూర్‌లోని లైఫ్ కోవిడ్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ డాక్టర్‌గా పనిచేస్తున్న అల్యాన సాయి కృష్ణ మార్కెట్‌లో ఆ ఇంజెక్షన్ల కొరత ఉండటంతో తానే వాటిని సమకూర్చుతానని పేషెంట్ తమ్ముడు రంజిత్ వద్ద రూ. 50 వేలు తీసుకొని రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు.
అయినా మహేశ్‌కు కరోనా తీవ్రత తగ్గలేదు. మెరుగైన చికి త్స కోసం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ప్రవీ ణ్ పేషెంట్‌కు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మూడు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అవసరమని, ఆ ఇంజెక్షన్లను తీసుకురావాల్సిందిగా కోరాడు. అయితే పేషెంట్ బంధువు డాక్టర్ సాయికృష్ణను సంప్రదించాడు. ధర పెరిగిందని 3 ఇంజెక్షన్లకు రూ.85 వేలు ఇవ్వాలని కోరాడు, అందుకు వారు అంగీకరించడంతో నిజామాబాద్‌లోని తిరుమల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మేల్ నర్స్‌గా పనిచేస్తున్న పులి సతీశ్‌గౌడ్‌తో కలిసి మూడు ఇంజెక్షన్లను రోగి బంధువుకు ఇచ్చారు.
డాక్టర్ ప్రవీణ్ వాటిని నకిలీ ఇంజెక్షన్లుగా గుర్తించి తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. రెండోసారి కూడా నకిలీ ఇంజెక్షన్లు ఇవ్వడంతో తాము మోసపోయామని గ్రహించిన రోగి సోదరుడు రంజిత్‌కుమార్ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పులి సతీశ్‌గౌడ్, డాక్టర్ సాయికృష్ణపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన జడ్జి పైవిధంగా తీర్పు ఇచ్చారు.


