● ఎన్‌ఈపీ–2020తో ఉన్నత విద్యలో ప్రక్షాళన ● ‘అందరికీ విద్య.. అందరికీ ఉన్నత విద్య’ లక్ష్యంగా ఒడిశా
భువనేశ్వర్: జాతీయ విద్యా విధానం – 2020 (ఎన్‌ఈపీ – 2020)కు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యలో బహుళ ప్రవేశ – నిష్క్రమణ విధానం, బహుళ విభాగాల పాఠ్యాంశాలు, విలువాధారిత కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్ ప్రకటించారు. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రెండో ‘ప్రజ్ఞా ప్రేరణ’ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి మాట్లాడారు. ఎన్‌ఈపీ–2020కు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యలో పలు నిర్మాణాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. బహుళ ప్రవేశ – నిష్క్రమణ విధానం, బహుళ విభాగాల పాఠ్యాంశాలు, విలువాధారిత కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టినట్లు వివరించారు.
1.60 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌లు..
విద్యార్థుల్లో ప్రాక్టికల్ లెర్నింగ్‌ను పెంచేందుకు 1,60,707 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. జ్ఞానోదయ – కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకం అమలుతో ఉన్నత విద్యలో చేరికలు కూడా పెరిగాయని చెప్పారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాధారణ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల చేరికలు 14,758 మేర పెరిగినట్లు వెల్లడించారు. ఆకాంక్షిత జిల్లాల్లోనూ ఈ పథకం సానుకూల ఫలితాలు ఇస్తోందన్నారు. కలహండి 99.09 శాతం, కొరాపుట్ 98.82 శాతం, బొలంగీర్ 95.57 శాతం, మల్కన్‌గిరి 95.37 శాతం, నవరంగ్‌పూర్ 94.64 శాతం విద్యార్థుల చేరిక నమోదైనట్లు తెలిపారు.
ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత వైఫై..
ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించేందుకు ఒడిశా శిక్షా నెట్ పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. మూడేళ్లకు రూ.393.62 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఈ పథకం అమలు కానుంది. కళాశాల ప్రాంగణాల్లో ప్రతి విద్యార్థికి రోజుకు 1 జీబీ డేటా ఉచితంగా అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఆవిష్కరణలకు ప్రోత్సాహకం..
విద్యార్థుల్లో ఆవిష్కరణలు, పారిశ్రామిక ఆలోచనలను ప్రోత్సహించేందుకు తొలిసారిగా రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పోటీ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఎంపికై న పది ఉత్తమ ప్రాజెక్టులకు వాటి ఆలోచనలు, వ్యాపార కార్యక్రమాలను అభివృద్ధి చేసుకునేందుకు ఒక్కొక్క ప్రాజెక్టుకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. ‘అందరికీ విద్య.. అందరికీ ఉన్నత విద్య’ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పునరుద్ఘాటించారు.
– పద్మశ్రీ ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్ మాట్లాడుతూ ఒడిశాలో ఎన్‌ఈపీ – 2020 అమలుతో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యా సంస్థల్లో స్టార్టప్ వ్యవస్థల ప్రోత్సాహానికి మరింత ప్రాధాన్యం లభిస్తోందన్నారు. వర్క్‌షాప్‌లో ఎన్‌ఈపీ – 2020 అమలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సమకాలీన పాఠ్యాంశాల్లో భారతీయ జ్ఞాన వ్యవస్థను అనుసంధానం చేయడం, ఆవిష్కరణలు, నాణ్యమైన పరిశోధన తదితర అంశాలపై విద్యావేత్తలు, విద్యా సంస్థల ప్రతినిధులు చర్చించారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ అరవింద్ అగర్వాల్ రాష్ట్రంలో ఎన్‌ఈపీ – 2020 అమలుకు శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై నివేదిక సమర్పించారు. విద్యా భారతి ఉన్నత శిక్షా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేఎన్ రఘునందన్, ఉన్నత విద్యా డైరెక్టర్ కాళీ ప్రసన్న మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.


