● అంత్యక్రియలకు హాజరుకాని కుమారుడు ● స్వచ్ఛందంగా ముందుకొచ్చిన స్నేహితులు
రాయగడ: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి, రక్తం పంచుకుని పెంచిన తండ్రి..ఆ బంధాల విలువ తెలియని కొడుకు ఒకవైపు.. ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయత, అనుబంధంతో చివరి వరకు తొడుగా నిలిచిన స్నేహితులు మరోవైపు. కన్నకొడుకు తన తండ్రిని గుర్తించడానికి నిరాకరించగా, మానవత్వమే బంధుత్వంగా మారి ఆయనకు అంతిమ వీడ్కోలు పలికింది. 31 ఏళ్లుగా ఏర్పడిన స్నేహబంధం చివరకు కన్నీటి వీడ్కోలుగా మారిన ఈ హృదయ విదారక ఘటన పట్టణంలో అందరినీ కలిచివేసింది. హర్యానాలోని గురుగ్రమ్‌కు చెందిన జిత్ సింగ్ సుమారు 31 ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం రాయగడకు వచ్చారు. ఢిల్లీ నుంచి వాహనాల విడిభాగాలను తీసుకువచ్చి జిల్లాలోని పలు గ్యారేజీలకు సరఫరా చేస్తూ వ్యాపారిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మానవత్వానికి, స్నేహబంధాలకు కూడా ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. రక్తసబంధాల కంటే మనుషుల మధ్య ప్రేమాభిమానాలకే ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనకు దూరమయ్యారు. భార్య కూడా మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయారు. కుమార్తె లండన్‌లో నివసిస్తుండగా, కుమారుడు ఢిల్లీలో ఉంటున్నాడు. కుమారుడి సంతొషమే తన సంతోషంగా భావించిన జిత్ సింగ్, తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కుమారుడిక కారు రుణం తీర్చేందుకు నెలకు రూ.30 వేలు చొప్పున డబ్బులు పంపించేవారు. అప్పు తీరిన తర్వాత కుమారుడు తండ్రితో సంబంధాలను తెంచుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. తన వివాహానికి కూడా తండ్రిని ఆహ్వానించలేదు. ఈ విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్న జిత్ సింగ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత మనవడు పుట్టాడని తెలిసి కనీసం అతడి ఫొటో అయినా చూడాలని ఆశపడ్డాడు. ఎన్నోసార్లు అడిగినా కుమారుడి నుంచి స్పందన కరువైంది. ఈ విషయాన్ని తన స్నేహితుడు రవీంద్ర పట్కాండాల్ వద్ద చెబుతూ జిత్ సింగ్ కన్నీరుమున్నీరయ్యారని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు. తనకు అంతిమ సమయం సమీపిస్తుందని ముందే ఊహించి పది రోజుల కిందటే తన అంత్యక్రియల కోసం రూ.24 వేలను ఇరుగు పొరుగువారికి అందజేశారు. శనివారం తుదిశ్వాస విడిచారు. జిత్ సింగ్ మరణవార్త తెలుసుకున్న ఓ పోలీసు మిత్రుడు ఢిల్లీలొ ఉన్న కుమారుడికి ఫోన్ చేసి సమాచారం అందించారు. తాను అతని కుమారుడినే కాదని నిరాకరించడంతో రాయగడలోని మిత్రులు ఒక్కటయ్యారు. ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అంత్యక్రియల కోసం అవసరమైన కట్టెలను సమకూర్చారు. జిత్ సింగ్‌కు కొత్త దుస్తులు ధరింపజేసి, ఆయన ఆత్మగౌరవానికి ప్రతీకగా తలపై పగిడీ కట్టారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం రాయగడ పట్టణంలోని సివారు సిరిగుడ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.


