గుండిచా ఆలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

గుండిచా ఆలయం మూసివేత

Nov 19 2026 1:01 AM | Updated on Nov 19 2026 1:01 AM

భువనేశ్వర్‌ : పూరీలోని శ్రీగుండిచా ఆలయం భక్తుల సందర్శనార్థం మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. తుఫాన్‌ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భక్తులు, యాత్రికుల భద్రతా దృష్ట్యా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఆలయం మూసివేస్తారు. సమీపంలో శారదాబలిలోకి కూడా ప్రవేశం ఉండదని ప్రకటన జారీ చేశారు.

విశాఖ–కిరండోల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు

రాయగడ : ఆక్వాన్‌ తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా ప్రయాణికుల భద్రత, రైల్వే కార్యకలాపాల రక్షణను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం–కిరండోల్‌ –విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 18515, 18516 నంబర్లు గల రైళ్లు ఈ నెల 19, 20 తేదీల్లో రాకపోకలు సాగించవని పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఆమ్లా నవమి పూజలు

రాయగడ : హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. శుక్లపక్ష నవమి తిథిని ఉసిరి నవమి, అక్షయ నవమిగా భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రాధాకాంత్‌ మందిరాల్లో భక్తిశ్రద్ధలతో నవమి పూజలు నిర్వహించారు. బ్రాహ్మణవీధిలోని రాధాకాంత్‌ మందిరంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

డోలీలో గర్భిణి తరలింపు

మల్కన్‌గిరి : మత్తిలి సమితి కర్తన్‌పల్లి పంచాయతీ గుగపోదర్‌ గ్రామంలో బుధవారం అడ్మి మడ్కమి అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో భర్త, బంధువులు 15 కిలోమీటర్లు డోలీలో మోసుకుంటూ కర్తన్పల్లి పంచాయతీకు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్సులో మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమె ప్రసవించారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ మోతలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గజపతి జిల్లాకు తుఫాన్‌ ముప్పు

పర్లాకిమిడి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్‌ తుఫాను ఈ నెల 19, 20 తేదీలలో తీవ్ర తుపానుగా ఏర్పడబోతుందని, ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న గజపతి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గజపతి జిల్లాకు 20న ఎల్లో హెచ్చరిక, 19, 20, 21 వరకూ ఆరెంజ్‌ హెచ్చరికలు ఐ.ఎం.డీ. జారీ చేసినట్టు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు ప్లస్‌ త్రీ క్లాసులకు ఈ నెల 19 నుంచి 21 వరకూ సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ భగత్‌ సామల్‌ కళ్యాణ్‌రావు, డిప్యూటీ కలెక్టర్‌ పవన్‌ కుమార్‌, ఎమెర్జెన్సీ అధికారి బినాయక్‌ రవుళో పాల్గొన్నారు.

చిలికాలో పడవ సర్వీసులు నిలిపివేత

భువనేశ్వర్‌: చిలికా సరసులో ఈ నెల 21 వరకు పడవ సర్వీసులు నిలిపివేయనున్నారు. రాష్ట్రానికి ఆక్వాన్‌ తుఫాను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చిలికా డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీడీఏ) నిత్య ప్రయాణికులు, పర్యాటక పడవ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు సీడీఏ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement