సభలో రూ.24,150 కోట్ల అనుబంధ బడ్జెట్
ప్రతిపక్ష నిరసనలతో శాసనసభ వాయిదా
భువనేశ్వర్: ఒడిశా శాసనసభ శీతాకాల సమావేశాల తొలిరోజే ప్రతిపక్షాల నిరసనలతో సభలో పలుమార్లు గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే బిజూ జనతా దళ్, కాంగ్రెస్ సభ్యులు పలు సమస్యలను లేవనెత్తుతూ నినాదాలు చేయడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. నిరసనలు కొనసాగడంతో స్పీకర్ సురమా పాఢి సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు.
రూ.24,150 కోట్ల అనుబంధ బడ్జెట్..
ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.24,150 కోట్ల అనుబంధ బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. ఇందులో కార్యక్రమాల వ్యయానికి రూ.17,990 కోట్లు, విపత్తు సహాయక చర్యలకు రూ.5,100 కోట్లు, పరిపాలనా వ్యయానికి రూ.1,060 కోట్లు కేటాయించారు.
ఏడు కొత్త కార్యక్రమాలకు చోటు..
అనుబంధ బడ్జెట్‌లో ప్రభుత్వం ఏడు కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించే ‘జ్ఞానోదయ: శిక్ష్యా రు సమృద్ధి’, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, ప్రజారోగ్య మౌలిక వసతులకు ఆర్థిక సహాయం, మూసివేసిన స్పిన్నింగ్ మిల్లుల పరిష్కారానికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్, గంజాంలో ఉప్పునీటి మడుగుల భూసేకరణ, కొత్త రైల్వే లైన్ల కోసం భూసేకరణ ఇందులో ఉన్నాయి. ఆహార భద్రతను బలోపేతం చేయడం, విద్య, వైద్య సేవల అందుబాటును విస్తరించడం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, మూసివేసిన పరిశ్రమలకు పరిష్కారం చూపడం, రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కేటాయింపులు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి, సమర్థవంతమైన పాలన, అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని ముఖ్యమంత్రి మాఝీ పునరుద్ఘాటించారు.
వరదలు, కొటియాపై విపక్షాల ఆందోళన
ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన సమయంలో బీజేడీ, కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని నిరసనకు దిగారు. వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేడీ సభ్యులు ఆరోపించారు. నదీ జలాల విడుదలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదని, వివిధ నదీ ప్రాజెక్టుల గేట్లు తెరవడం వల్ల దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని విమర్శించారు. మరోవైపు, కొటియా సమస్యను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సభ్యులు నిరసన చేపట్టారు. ఒడిశా ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిపోర్టరు టేబులు వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ కూడా నిరసనల సమయంలో సభలోనే ఉన్నారు.
సంతాప తీర్మానంతో ప్రారంభం..
అర్నబ్ తుఫాను కారణంగా సంభవించిన వరదలు, కొండచరియల విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి, అలాగే ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు నివాళులర్పిస్తూ సంతాప తీర్మానంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం మొదలైన వెంటనే ప్రతిపక్ష నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పలుమార్లు సభ్యులను శాంతించాలని, సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినా నిరసనలు ఆగకపోవడంతో సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది.


